Somu Veerraju: పోలవరం వివాదాన్ని రేపడం వెనుక పెద్ద కుట్ర ఉంది: సోము వీర్రాజు
- పోలవరం అంశంలో జరుగుతున్న పరిణామాలు విభజన అంశాన్ని తిరగతోడినట్లేనన్న వీర్రాజు
- పోలవరంను వ్యతిరేకిస్తే విభజన చట్టాన్ని వ్యతిరేకించినట్టేనని వ్యాఖ్య
- ఏపీ ప్రజలను జగన్ మోసం చేస్తున్నారన్న వీర్రాజు
భద్రాచలం ముంపుకు పోలవరం ప్రాజెక్టే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తూ... పోలవరంపై వివాదం రేపడం వెనుక పెద్ద కుట్ర దాగుందని అన్నారు. పోలవరం విషయంలో జరుగుతున్న పరిణామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని తిరగతోడినట్లేనని చెప్పారు. పోలవరంను ప్రశ్నించడమంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించినట్టేనని అన్నారు.
1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మం జిల్లాలో కలిపారని... రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలంతో పాటు మరో రెండు మండలాలను తెలంగాణకు ఇచ్చారని సోము వీర్రాజు చెప్పారు. పోలవరం నిర్మాణం వల్ల ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న మండలాలు తెలంగాణలో ఉండటంతో వాటిని ఏపీకి ఇచ్చేశారని తెలిపారు. పోలవరంను వ్యతిరేకిస్తే విభజన చట్టాన్ని వ్యతిరేకించినట్టేనని చెప్పారు.
పోలవరం విషయంలో రాష్ట్ర ప్రజలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోసం చేస్తున్నారని సోము వీర్రాజు చెప్పారు. చంద్రబాబు హయాంలో పోలవరంలో అవినీతి జరిగిందని గతంలో జగన్ ఆరోపించారని.. మరి ఈ మూడేళ్ల కాలంలో అవినీతిని బయటపెట్టి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందని చెప్పారు.