Nasa: ఇంద్ర ధనుస్సులా మెరిసిపోతున్న గ్రహం.. నాసా చెప్పిన వివరాలివిగో..!
- ప్లూటోకు సంబంధించిన కొత్త ఫొటో, వివరాలను తాజాగా వెల్లడించిన నాసా
- నాసా అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో ఫొటో పోస్టు చేసిన శాస్త్రవేత్తలు
- ప్లూటోపై వివిధ ప్రాంతాలు, లోయలు, పర్వతాలను గుర్తించేలా న్యూహారిజాన్స్ చిత్రం
- ఒక్క రోజులోనే పది లక్షల వరకు లైక్ లు
పై చిత్రంలో ఇంద్ర ధనుస్సులా మెరిసిపోతున్నది మన సౌర కుటుంబంలో చివరన ఉన్న ప్లూటో గ్రహం. మొదట్లో సౌర కుటుంబంలోని 9 గ్రహాల్లో ఒకటిగా ఉన్న దీనిని కొన్నేళ్ల కిందత ఆ హోదా నుంచి తొలగించారు. ప్రస్తుతం ప్లూటోను మరుగుజ్జు గ్రహంగానే పిలుస్తున్నారు. దీనికి సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ చిత్రాన్ని పెట్టింది. దానితోపాటు ప్లూటో విశేషాలనూ పేర్కొంది.
న్యూహారిజాన్స్ తీసిన చిత్రం
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గతంలో ప్రయోగించిన న్యూహారిజాన్స్ వ్యోమ నౌక ప్లూటోను దగ్గరి నుంచి స్పష్టంగా చిత్రీకరించింది. ప్లూటోపై ఉన్న వివిధ ప్రాంతాలు, లోయలు, పర్వతాలు, నున్నగా మంచుతో కూడిన మైదాన ప్రాంతాలను స్పష్టంగా ఫొటోలు తీసింది. ఆ వివరాలు మరింత స్పష్టంగా కనిపించేలా నాసా శాస్త్రవేత్తలు.. న్యూహారిజాన్స్ తీసిన చిత్రాన్ని రంగుల్లోకి మార్చారు.
- సౌర కుటుంబంలో అల్లంత దూరాన ఉన్న గ్రహాలు, గ్రహ శకలాలను పరిశీలించేందుకు నాసా 2006లో న్యూహారిజాన్స్ వ్యోమనౌకను ప్రయోగించింది.
- అది వివిధ గ్రహాలను పరిశీలిస్తూ.. 2015లో ప్లూటోకు దగ్గరగా చేరింది. సుమారు ఆరు నెలల పాటు ప్లూటోకు సమీపంగా ప్రయాణించిన న్యూహారిజాన్స్.. ఆ మరుగుజ్జు గ్రహానికి సంబంధించిన ఎన్నోచిత్రాలను మనకు అందించింది.
- ఇన్ స్టాగ్రామ్ లో నాసా పెట్టిన ఈ ఫొటో, పోస్టుకు కేవలం ఒక రోజులోనే దాదాపు పది లక్షల దాకా లైక్ లు, వేలల్లో కామెంట్లు రావడం గమనార్హం.