TDP: బాల కోటిరెడ్డిపై దాడి చేసింది టీడీపీ నేత వెంకటేశ్వరరెడ్డి: నరసరావుపేట డీఎస్పీ వివరణ
![narasaraopet dsp media meet on attack on tdp leader balakotireddy](https://imgd.ap7am.com/thumbnail/cr-20220719tn62d6c856a909b.jpg)
- టీడీపీలో అంతర్గత విభేదాలే దాడికి కారణమన్న డీఎస్సీ
- వెంకటేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడి
- బుధవారం నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామన్న డీఎస్పీ
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డిపై మంగళవారం జరిగిన దాడికి సంబంధించి నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. బాల కోటిరెడ్డిపై దాడికి పాల్పడింది టీడీపీకి చెందిన వెంకటేశ్వరరెడ్డి అని డీఎస్పీ ప్రకటించారు. బాల కోటిరెడ్డి కుమారుడి ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర రెడ్డిపై కేసు నమోదు చేయడంతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కూడా ఆయన వెల్లడించారు.
టీడీపీలోని అంతర్గత విభేదాల కారణంగానే ఈ దాడి జరిగిందని కూడా డీఎస్పీ తెలిపారు. కొంతకాలం క్రితం ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో బాల కోటిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డిలు రెండు వర్గాలుగా విడిపోయారని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో బాల కోటిరెడ్డి ఎదుగుదలను సహించలేకే వెంకటేశ్వరరెడ్డి బాధితుడిపై దాడికి దిగారని తెలిపారు. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్న డీఎస్పీ..బుధవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.