Dinesh Ramdin: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండీస్ సీనియర్ ఆటగాళ్లు
- ఒకేరోజు రిటైర్మెంట్ ప్రకటన చేసిన రామ్ దిన్, సిమ్మన్స్
- వెస్టిండీస్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడిన వైనం
- కొంతకాలంగా జాతీయజట్టుకు దూరం
- ఫ్రాంచైజీ క్రికెట్ కు అందుబాటులో ఉంటామన్న క్రికెటర్లు
వెస్టిండీస్ సీనియర్ ఆటగాళ్లు దినేశ్ రామ్ దిన్, లెండిల్ సిమ్మన్స్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. వీరిద్దరూ ఒకే రోజు వీడ్కోలు పలకడం విశేషం. అయితే, తాము ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ లకు అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు.
37 ఏళ్ల దినేశ్ రామ్ దిన్ భారత సంతతి కరీబియన్ క్రికెటర్. ట్రినిడాడ్ కు చెందినవాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా వెస్టిండీస్ జట్టుకు సేవలందించాడు. రామ్ దిన్ 74 టెస్టులాడి 2,898 పరుగులు సాధించాడు. వాటిలో 4 సెంచరీలు, 15 అర్ధసెంచరీలు ఉన్నాయి. 205 క్యాచ్ లు, 12 స్టంపింగ్ లు ఉన్నాయి. 139 వన్డేల్లో 2,200 పరుగులు చేయగా, అందులో 2 సెంచరీలు, 8 అర్ధసెంచరీలు, 181 క్యాచ్ లు, 7 స్టంపింగ్ లు ఉన్నాయి. 71 అంతర్జాతీయ టీ20 పోటీలు ఆడి 115.42 స్ట్రయిక్ రేటుతో 636 పరుగులు చేశాడు. టీ20ల్లో 43 క్యాచ్ లు పట్టి, 20 స్టంపింగ్ లు చేశాడు.
గత కొంతకాలంగా జాతీయజట్టులో కనిపించని రామ్ దిన్ ను త్వరలో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ కు ఏ ఫ్రాంచైజీ కూడా తీసుకోలేదు. రామ్ దిన్ గతంలో వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్ గానూ వ్యవహరించాడు.
ఇక, దూకుడైన ఓపెనర్ గా గుర్తింపు తెచ్చుకున్న లెండిల్ సిమ్మన్స్ కొంతకాలంగా ఫామ్ లో లేడు. సిమ్మన్స్ వయసు 37 ఏళ్లు. సిమ్మన్స్ కూడా ట్రినిడాడ్ కు చెందినవాడే. సిమ్మన్స్ 8 టెస్టులాడి 278 పరుగులు చేశాడు. 68 వన్డేల్లో 1,958 పరుగులు నమోదు చేశాడు. వాటిలో 2 సెంచరీలు, 16 అర్ధసెంచరీలు ఉన్నాయి. 68 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడి 120.80 స్ట్రయిక్ రేటుతో 1,527 పరుగులు సాధించాడు. సిమ్మన్స్ ఐపీఎల్ లోనూ ఆడాడు. ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.