Polavaram Project: భద్రాచలం కావాలని అడిగితే ఇచ్చేస్తారా?: అంబటి రాంబాబు
![ap minister ambati rambabu hits back on telangana leaders comments on polavaram project](https://imgd.ap7am.com/thumbnail/cr-20220719tn62d68f40a80f0.jpg)
- సీడబ్ల్యూసీ అనుమతుల మేరకే పోలవరం నిర్మాణమన్న అంబటి
- పోలవరం ఎత్తుపై వివాదం మంచిది కాదని వ్యాఖ్య
- ముంపు భావనతోనే 7 మండలాలు ఏపీలో విలీనమయ్యాయని వివరణ
- బాధ్యతాయుతమైన పదవుల్లోని వారు ఇలా మాట్లాడటం సరికాదన్న మంత్రి
భద్రాచలం వరద ముంపునకు గురైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం రేకెత్తింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంపు వల్లే భద్రాచలం వరద ముంపునకు గురైందని ఆరోపించిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్... పోలవరం ఎత్తును పెంచరాదంటూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనం అయిన 7 మండలాలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
పువ్వాడ వ్యాఖ్యలపై ఇప్పటికే ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. తాజాగా ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా పువ్వాడ వ్యాఖ్యలను తప్పుబడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
నేటి సాయంత్రం మీడియా ముందుకు వచ్చిన అంబటి... బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ నేతల వ్యాఖ్యలు సరికాదని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సీడబ్ల్యూసీ అనుమతితోనే నిర్మాణం జరుగుతోందని ఆయన తెలిపారు.
పోలవరం ఎత్తు పెంపుపై వివాదం సరికాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును దశలవారీగా పూర్తి చేస్తామన్న అంబటి... ప్రాజెక్టు వల్ల ముంపు ఉందన్న భావనతోనే 7 మండలాలను ఏపీలో విలీనం చేశారని తెలిపారు. ఇప్పుడు ముంపు ఉందంటున్న నేతలు... తాము భద్రాచలం కావాలని అడిగితే ఇచ్చేస్తారా? అని అంబటి ప్రశ్నించారు.