Sure Signs: గుండె బలంగా లేదన్న విషయాన్ని ఇలా తెలుసుకోవచ్చు..!

Sure Signs Your Heart Is not As Strong as it Should Be

  • తరచుగా అలసిపోయినట్టుగా అనిపిస్తోందా..?
  • ఊపిరి చాలడం లేదా..?
  • గుండె పనితీరు సరిగ్గా లేదనడానికి సంకేతాలే
  • ఒక్కసారి వైద్యుడిని సంప్రదించాలి

హార్ట్ ఎటాక్ కారణంగా మన దేశంలో మరణాల రేటు పెరుగుతోంది. ప్రధానంగా జీవనశైలి, ఆహారం గుండెకు ముప్పుగా మారుతున్నాయి. వయసు రీత్యా కొన్ని కండరాలు బలహీనపడడం సాధారణంగా జరిగేదే. గుండె కండరాలు కూడా అదే మాదిరి బలహీనపడొచ్చు. 

సరైన రక్షణ చర్యలు తీసుకోకపోతే, కొంత కాలానికి గుండె కండరాలు మరింత బలహీనపడిపోతాయి. దాంతో సాధారణ పనితీరు చూపించలేదు. అప్పుడు గుండె బబ్బులు, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ తదితర తీవ్ర సమస్యలు కనిపిస్తాయి. గుండె పనితీరు సజావుగా లేదనడాన్ని కొన్ని సంకేతాల ఆధారంగా తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఇవి సరిగ్గా పనిచేయాలి..
గుండె ఆరోగ్యాన్ని నిర్ణయించడానికి కొన్ని అంశాలు ప్రామాణికంగా పనిచేస్తాయి. గుండె కండరాలు బలంగా ఉంటే, రక్తాన్ని గుండె బలంగా పంప్ చేయగలదు. దాంతో హృదయ స్పందనలు క్రమబద్ధంగా సాగుతాయి. గుండె వాల్వ్ (కవాటాలు)ల్లో ఎటువంటి లీకేజీ లేకుండా రక్త ప్రవాహం సాఫీగా సాగేందుకు అనుకూలంగా ఉండాలి. ఆర్టరీలు (ధమనులు) ఎటువంటి బ్లాకేజీ లేకుండా రక్త ప్రవాహం సాఫీగా ఉండాలి. వీటిల్లో బ్లాక్ లు ఉండకూడదు. బ్లాకేజీలు ఏర్పడితే గుండెపోటుకు దారితీస్తుంది.  

లక్షణాలు..
శ్వాస చాలడం లేదని అనిపించడం శ్వాసవ్యవస్థకు సంబంధించిన సంకేతంగానే కాదు.. గుండెకు సంబంధమైనదిగా కూడా చూడొచ్చు. శ్వాసపరమైన సమస్యలు ఏవీ లేకుండా ఇలా అనిపించిందంటే అది కచ్చితంగా గుండె బలహీనతగానే చూడాలి. గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయలేకపోవచ్చు. దీనివల్ల ఉపిరితిత్తులపై శ్రమ పడుతుంది. ఊపిరితిత్తుల్లో ద్రవాలు పేరుకుపోవడం వల్ల కూడా గుండె జబ్బు వస్తుంది. గతి తప్పిన హృదయ స్పందనల వల్ల ఊపిరితిత్తుల్లో గాలి సరిగ్గా నిండకపోవడం వల్ల కూడా శ్వాస ఆడనట్టు అనిపిస్తుంది. 

తరచూ అలసట, నీరసంగా అనిపిస్తుంటే గుండె ఆరోగ్యం ఎలా ఉందో పరీక్షించుకోవడం మంచిది. దీనికి అనీమియా లేక మధుమేహం, స్లీప్ అప్నియా (నిద్రలేమి), కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, ఒత్తిడి కారణం కావచ్చు. గుండె పంపింగ్ సరిగ్గా లేకపోతే శరీరమంతటికీ రక్తం, ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీంతో అలసిపోయినట్టు అనిపిస్తుంది. కుటుంబంలో ఎవరికైనా గుండె వ్యాధుల చరిత్ర ఉన్నా, ఈ లక్షణాలు కనిపించినా గుండె సమస్యగానే సందేహించాలి. 

కారణాలు.. 
జన్యు సంబంధితంగా గుండె బలహీనపడడం అనే సమస్యను చూడొచ్చు. జీవనశైలి వల్ల రావచ్చు. పర్యావరణ అంశాలు కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అధిక రక్తపోటు, పొగతాగడం, స్థూల కాయం, మానసిక కుంగుబాటు, వ్యాయామం లేకపోవడం ఇవన్నీ కూడా గుండెను బలహీనపరుస్తాయి. 

పరిష్కారం..
గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. వయసు, కుటుంబ చరిత్ర ఆధారంగా వచ్చే గుండె సమస్యలను మార్చలేము. కానీ, జీవనశైలి మార్పులు, వ్యాయామంతో కొంత ఫలితాన్ని చూడొచ్చు. గుండె సమస్యలు ముదిరిపోకుండా చూసుకోవచ్చు. ఇందుకు ఒకసారి కార్డియాలజిస్ట్ స్క్రీనింగ్ అవసరం. క్రమం తప్పకుండా వారు సూచించిన వ్యాయామాలు చేయాలి. పోషకాహార నిపుణుల సూచనల మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

  • Loading...

More Telugu News