multi year: హెల్త్ ఇన్సూరెన్స్ ఏడాదికా.. రెండు, మూడేళ్లకా..?
- మూడేళ్లకు తీసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు
- ప్రీమియంలో రాయితీ, పెరుగుదల నుంచి రక్షణ
- ఒకవేళ ఏడాది తర్వాత సేవలు నచ్చకపోతే నష్టపోవాల్సిందే
- పోర్టింగ్ పెట్టుకుంటే కట్టిన ప్రీమియం వెనక్కి రాదు
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు గణనీయంగా పెరుగుతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం చాలా మందికి తెలిసొచ్చింది. దీంతో కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. హెల్త్ ప్లాన్ ను ఏడాదికే కాదు, రెండు, మూడేళ్లకు కలిపి ఒకేసారి తీసుకోవచ్చు. మూడేళ్ల ప్రీమియం ఒకేసారి చెల్లిస్తున్నారు కనుక బీమా సంస్థలు ప్రీమియంలో కొంత రాయితీ ఇస్తాయి.
మల్టీ ఇయర్ (ఏడాదికి మించిన) పాలసీ తీసుకుంటే తిరిగి రెన్యువల్ చేసుకునే వరకు ప్రీమియంలో మార్పు ఉండదు. బీమా సంస్థలు ఎప్పటికప్పుడు ప్రీమియంను సవరిస్తుంటాయి. దీనివల్ల రెన్యువల్ సమయంలో ఎక్కువ ప్రీమియం చెల్లించకుండా రెండేళ్ల పాటు రక్షణ కల్పించుకున్నట్టు అవుతుంది. తిరిగి రెన్యువల్ సమయంలోనే పెరిగిన రేట్ల ప్రకారం ప్రీమియం చెల్లించాలి.
మూడేళ్లకు ఒకేసారి ప్రీమియం చెల్లించి ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. ఏడాది తర్వాత సంస్థ సేవలు నచ్చలేదనో, క్లెయిమ్ విషయంలో కొర్రీలు పెట్టిందనో వేరే సంస్థకు మారిపోదామని అనుకుంటే..? కట్టిన ప్రీమియం వెనక్కి రాదు. అదే సమయంలో పోర్టింగ్ పెట్టుకుంటే మళ్లీ తాజాగా ప్రీమియం కట్టాల్సిందే. వైద్య పరీక్షలు కూడా చేయించుకోవాల్సి రావచ్చు. ఒకవేళ బీమా సంస్థ ప్రీమియం రేట్లను తగ్గిస్తే ఈ ప్రయోజనం కోల్పోతారు.