TDP: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయని బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి... కారణమేంటంటే..!
- విదేశీ పర్యటనలో టీడీపీ ఎమ్మెల్యేలు
- మధ్యాహ్నం వరకు ఓటు వేసిన వారు 167 మంది
- మిగిలిన వారి ఓటింగ్‌పై నెలకొన్న ఆసక్తి
భారత రాష్ట్రపతి ఎన్నిక కోసం సోమవారం ఉదయం దేశవ్యాప్తంగా పోలింగ్ మొదలైంది. ఢిల్లీలోని పార్లమెంటులో ఎంపీలు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాలుపంచుకుంటున్నారు. సోమవారం మధ్యాహ్నానికే దాదాపుగా పోలింగ్ ముగిసిందనే చెప్పాలి. అయితే ఏపీలో ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి (రాజమహేంద్రవరం రూరల్), నందమూరి బాలకృష్ణ (హిందూపురం)లు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేదు.
చాలా రోజుల క్రితమే గోరంట్ల అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇంకా ఆయన అమెరికా నుంచి తిరిగి రాలేదు. ఈ కారణంగానే ఆయన రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇక బాలకృష్ణ కూడా ఇటీవలే విదేశీ పర్యటనకు వెళ్లారు. దీంతో ఆయన కూడా ఓటింగ్‌కు హాజరు కాలేకపోయారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఏపీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే... వారిలో 167 మంది తమ ఓట్లు వేశారు. మిగిలిన వారిలో గోరంట్ల, బాలకృష్ణలను మినహాయిస్తే ఇంకెందరు ఓటింగ్‌కు హాజరు అవుతారన్నదానిపై ఆసక్తి నెలకొంది.