Kiran Rijiju: హైకోర్టులు, దిగువస్థాయి కోర్టుల్లో స్థానిక భాషలు వినియోగించాలి: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు
- జైపూర్ లో 18 ఆలిండియా లీగల్ సర్వీసెస్ సమావేశాలు
- కోర్టుల్లో ప్రాంతీయ, స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
- మన మాతృభాష తక్కువది అనే భావనను విడనాడాలన్న మంత్రి
ప్రాంతీయ భాషల్లో కోర్టు తీర్పులు ఉండాలన్న వాదనకు బలం చేకూర్చేలా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యలు చేశారు. జైపూర్ లో 18వ ఆలిండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశాల ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ, హైకోర్టులు, దిగువస్థాయి న్యాయస్థానాల్లో ఆయా వ్యవహారిక అంశాల్లో ప్రాంతీయ, స్థానిక భాషలు వినియోగించాలన్నదే తమ అభిమతమని తెలిపారు. ఇంగ్లీషు కంటే మన మాతృభాష తక్కువది అనే భావనను విడనాడాలని పిలుపునిచ్చారు.
అంతేకాదు, ఇంగ్లీషులో బాగా మాట్లాడే న్యాయవాదులకే ఎక్కువ కేసులు, ఫీజులు, గౌరవం అనే వాదన సరికాదని కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు. ఏ ఒక్క న్యాయస్థానం కూడా కేవలం ఉన్నత వర్గాలకే ప్రాధాన్యత ఇవ్వరాదని, సమాన రీతిలో అన్ని వర్గాలకు న్యాయస్థానం తలుపులు తెరిచి ఉంచాలని హితవు పలికారు.
"సుప్రీం కోర్టులో వాదనలు, తీర్పులు ఎలాగూ ఆంగ్లంలోనే ఉంటాయి. కానీ, మా ఆలోచన ఏంటంటే... హైకోర్టులు, అంతకంటే దిగువ కోర్టుల్లో ప్రాంతీయ, స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం" అని కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు.