Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికల నుంచి తప్పుకోండి!... యశ్వంత్ సిన్హాకు అంబేద్కర్ మనవడి సూచన!
- సోమవారమే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
- బరిలో ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా
- ఎస్సీ, ఎస్టీ ప్రతినిధుల ఓట్లు ముర్ముకేనన్న ప్రకాశ్
భారత రాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది. బరిలో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా నిలిచారు. ఈ నెల 18 (సోమవారం)న పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇలాంటి సమయంలో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మనవడు, వంచిత్ బహుజన్ అఘాడీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేద్కర్ ఓ సూచన చేశారు.
రాష్ట్రపతి ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన యశ్వంత్ సిన్హాకు ప్రకాశ్ అంబేద్కర్ సూచించారు. దేశవ్యాప్తంగా ఆయా పార్టీలకు చెందిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ద్రౌపది ముర్ముకు ఓటు వేసేందుకు నిర్ణయించుకున్నారని, ఈ క్రమంలో పోటీ నుంచి తప్పుకోవాలని సిన్హాకు ఆయన సూచించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఎప్పుడో ముగియగా... ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైన వేళ ప్రకాశ్ అంబేద్కర్ నుంచి ఇలాంటి ప్రతిపాదన రావడం గమనార్హం.