Team India: 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన భారత స్పిన్నర్ చహల్
- ఇంగ్లండ్ తో రెండో వన్డే మ్యాచు లో నాలుగు వికెట్లు పడగొట్టిన స్పిన్నర్
- లార్డ్స్ లో ఒక వన్డేలో అత్యుత్తమ బౌలింగ్ నమోదు
- 1983 ప్రపంచ కప్ ఫైనల్లో అమర్ నాథ్ రికార్డును అధిగమించిన చహల్
ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఓడిపోయినప్పటికీ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ మక్కాగా భావించే ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో భారత్ తరఫున ఒక వన్డే మ్యాచ్ లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో చహల్ 10 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. దాంతో, 1983 ప్రపంచ కప్ ఫైనల్లో వెస్టిండీస్ పై నాటి భారత ఆల్ రౌండర్ 3/12తో నమోదు చేసిన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డును చహల్ బద్దలు కొట్టాడు.
అంతేకాదు లార్డ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టిన భారత తొలి బౌలర్ గానూ చహల్ రికార్డుకెక్కాడు. గురువారం నాటి మ్యాచ్ లో పవర్ ప్లే తర్వాత బౌలింగ్ కు వచ్చిన చహల్ తన స్పిన్ మాయాజాలం చూపెట్టాడు. జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్ తో పాటు ధాటిగా ఆడుతున్న మొయిన్ అలీ వికెట్లు రాబట్టాడు. ఈ నలుగురూ చహల్ మణికట్టును చదవలేక వికెట్లు పారేసుకున్నారు. అంతా స్వీప్ లేదా రివర్స్ స్వీప్ షాట్లకు ప్రయత్నించి ఔటవడం గమనార్హం.