South Africa: ప్రపంచకప్ 2023కు అర్హతను సందేహంలో పడేసుకున్న దక్షిణాఫ్రికా
- 2023 జనవరిలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ రద్ధు
- రీషెడ్యూల్ చేయాలని కోరిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు
- ప్రత్యామ్నాయ తేదీలు అందుబాటులో లేవన్న ఆస్ట్రేలియా
ప్రపంచకప్ 2023కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని దక్షిణాఫ్రికా ప్రమాదంలో పడేసుకుంది. వచ్చే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియతో జరగాల్సిన వన్డే సిరీస్ ను దక్షిణాఫ్రికా రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఐసీసీ సూపర్ లీగ్ లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య 2023 జనవరిలో వన్డే సిరీస్ జరగాల్సి ఉంది. ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2023కు నేరుగా అర్హతను ఈ సిరీస్ ద్వారా ఖాయం చేసుకోవచ్చు.
2023 పురుషుల వన్డే ప్రపంచకప్ భారత్ లోనే అక్టోబర్-నవంబర్ మాసాల్లో జరగనుంది. జనవరిలో జరగాల్సిన వన్డే సిరీస్ ను రీషెడ్యూల్ చేయాలని దక్షిణాఫ్రికా కోరడంతో.. ప్రత్యామ్నాయ తేదీలను ఆస్ట్రేలియా పరిశీలించింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ సహా రద్దీతో కూడిన అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా, దక్షిణాఫ్రికా కోరినట్టు ప్రత్యామ్నాయ తేదీలు అందుబాటులో లేవని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
‘‘2023 మేలో ఉన్న అర్హత కటాఫ్ తేదీ నాటికి వన్డే సిరీస్ జరగకపోతే, ఆస్ట్రేలియాకు కాంపిటీషన్ పాయింట్లను కేటాయించేందుకు దక్షిణాఫ్రికా అంగీకరించింది’’ అని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. మరోవైపు ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా మూడు టెస్ట్ మ్యాచ్ లను ఆడనుంది. డిసెంబర్ 17 నుంచి జనవరి 8 వరకు ఇవి జరుగుతాయి.