Sri Lanka: దేశం విడిచి పారిపోయేందుకు శ్రీలంక మాజీ మంత్రి యత్నం.. అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు

Immigration officials foil Basil Rajapaksas bid to flee country

  • అధ్యక్ష, ప్రధానమంత్రి నివాసాల్లోనే నిరసనకారుల తిష్ఠ
  • అధ్యక్షుడు రాజీనామా చేసే వరకు కదిలేది లేదంటున్న వైనం
  • శుక్రవారం పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేస్తామన్న స్పీకర్
  • ఈ నెల 20న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్న స్పీకర్
  • విమానాశ్రయంలో మాజీ మంత్రిని అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స నివాసాలను ఇటీవల ముట్టడించి ఆక్రమించుకున్న ఆందోళనకారులు ఇంకా అక్కడే తిష్ఠవేశారు. పోలీసులు కూడా జోక్యం చేసుకోకపోవడంతో అధ్యక్ష, ప్రధాని నివాస భవనాల వద్ద వాతావరణం ప్రశాంతంగానే ఉంది. 

మరోవైపు, అధ్యక్షుడు వైదొలగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తాము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని నిరసనకారులు చెబుతున్నారు. కొత్త అధ్యక్షుడిని ఈ నెల 20న ఎన్నుకుంటామని స్పీకర్ మహింద యాపా అబేవర్ధన తెలిపారు. శుక్రవారం పార్లమెంటు తెరుచుకుంటుందని, ఆ తర్వాత ఐదు రోజుల తర్వాత కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఆయన చెప్పారు. 

అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రితోపాటు ఆయన కేబినెట్ రాజీనామాకు సిద్ధంగా ఉందని అధికార పార్టీ పేర్కొంది. ఇంకోవైపు, తాత్కాలిక అధ్యక్ష పదవికి సజిత్ ప్రేమదాసను నామినేట్ చేయాలని శ్రీలంక ప్రధాన ప్రతిపక్షమైన సమగి జన బలవేగయ (SJB) ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆ పార్టీకి పార్లమెంటులో దాదాపు 50 మంది ఎంపీలు ఉన్నారు. 

కాగా, మాజీ మంత్రి బాసిల్ రాజపక్సే గత రాత్రి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కటునాయకే విమానాశ్రయంలోని సిల్క్ రూట్ డిపార్చర్ టెర్మినల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను అడ్డుకోవడంతో దేశం విడిచి పారిపోవాలన్న ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

  • Loading...

More Telugu News