HEALTHY: మనకు ఎంత సమయం పాటు వ్యాయామం అవసరం?

HOW MUCH EXERCISE DO YOU ACTUALLY NEED TO BE HEALTHY

  • రోజులో 30 నిమిషాల పాటు కఠోరంగా ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి
  • వారంలో 150 నిమిషాలకు తగ్గకుండా చూసుకోవాలి
  • ఏరోబిక్ వ్యాయామాలతో ఎక్కువ ఫలితాలు

కరోనా వచ్చిన తర్వాతే చాలా మందికి ఆరోగ్యం విలువ తెలిసి వచ్చింది. మంచి జీవనశైలి, ఆహార నియమాలను పాటించిన వారిని వైరస్ ఏమీ చేయలేకపోయింది. వైరస్ లు అనేకాదు.. నేడు మనం ఎదుర్కొనే ఎన్నో జీవనశైలి ఆరోగ్య సమస్యలకు వ్యాధి నిరోధక శక్తి పాత్ర కీలకం అవుతుంది. ఇమ్యూనిటీ బలంగా ఉంటే వ్యాధులపై సులువుగా పై చేయి సాధించొచ్చు. శరీరం చురుకుదనాన్ని సంతరించుకోవాలన్నా..? వ్యాధి నిరోధక శక్తి బలపడాలన్నా..? రక్త ప్రవాహం మెరుగుపడాలన్నా శారీరక వ్యాయామం తప్పనిసరి. శరీరాన్ని కష్టపెట్టడం వల్ల హాని చేసే వ్యర్థాలు, కొవ్వులు బయటకు వెళ్లిపోతాయి. అప్పుడు ఎన్నో వ్యాధుల ముప్పు మనకు తగ్గిపోతుంది.

ఎంత సమయం పాటు..?
ఒకరు ఎంత సమయం పాటు శారీరక వ్యాయామం చేయాలన్న దానికి అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కొన్ని వివరాలు విడుదల చేసింది. వయోజనుడైన ఒక వ్యక్తి సగటున ఒక వారంలో 150 నిమిషాల పాటు మధ్యస్థ స్థాయి ఏరోబిక్ యాక్టివిటీ చేయాలి. లేదంటే 75 నిమిషాల పాటు కఠోర ఏరోబిక్ యాక్టివిటీ చేయాలి. బ్రిస్క్ వాకింగ్ (చురుగ్గా, వేగంగా నడవడం), జాగింగ్ లేదా రన్నింగ్ చేసుకోవచ్చు. రోజువారీ జీవితంలో భాగంగా చేసే కేలరీల ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

వారంలో శారీరక వ్యాయామానికి వెచ్చించాల్సిన కనీస సమయం ఎంతన్న దానిపై పరిశోధకులు ఎన్నో ఏళ్ల పాటు శ్రమిస్తూనే ఉన్నారు. 2008లో అమెరికన్లకు ఉద్దేశించిన ఫిజికల్ యాక్టివిటీ గైడ్ లైన్స్ సైతం 150 నిమిషాలను సూచించింది. అంటే నిత్యం కనీసం 30 నిమిషాల చొప్పున ఏరోబిక్ ఎక్స్ ర్ సైజ్ లను వారంలో కనీసం ఐదు రోజులు చేయాలి. కుదిరితే ఏడు రోజులు చేయడం ఇంకా మంచిదే. 

ఏవి చేయవచ్చు..?
శారీరక కదలికలు అంటే శక్తిని ఖర్చు చేయించేవి ఏవైనా కావచ్చు. పనిలో భాగంగా నడవడం, బరువులు ఎత్తడం, బరువులు మోయడం, ఇంట్లో పనులు, చిన్నారుల సంరక్షణ, గార్డెనింగ్, సైకిల్ పై ప్రయాణం, మెట్లు ఎక్కడం ఇవన్నీ శారీరక కదలికల కిందకు వస్తాయన్నది నిపుణుల నిర్వచనం. ఏ రకం అన్నదానితో సంబంధం లేకుండా శారీకక కార్యకలాపాలతో శరీరాన్ని కష్టపెట్టడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. శారీరకంగా ఏదో ఒక పని చేస్తూ చురుగ్గా ఉండే వారు.. నిశ్చలంగా, పెద్దగా కదలకుండా ఉండేవారి కంటే మంచి ఆరోగ్యంతో, ఎక్కువ కాలం పాటు జీవిస్తారని పరిశోధకులు అంటున్నారు. 

ఏరోబిక్ అయితే మంచిది
 ఏరోబిక్ ఎక్సర్ సైజులను ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు తీసుకొచ్చే వ్యాయామాలుగా నిపుణులు భావిస్తుంటారు. గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా, మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక సమస్యల ముప్పును ఏరోబిక్ వ్యాయామాలు తగ్గిస్తాయి. అలాగే, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. హైకింగ్ (ప్రకృతి ప్రదేశాలలో దీర్ఘ నడక), స్విమ్మింగ్ (ఈత), నృత్యం, జంపింగ్ రోప్, బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్ ఇవన్నీ ఏరోబిక్ వ్యాయామాల కిందకే వస్తాయి. అయితే, ఇక్కడ వయసును బట్టి వ్యాయామాన్ని ఎంపిక చేసుకోవాలి. వృద్ధాప్యంలోకి వచ్చిన వారికి కండరాల బలం తగ్గుతుంది. శరీర బ్యాలన్స్ కూడా సరిగ్గా ఉండదు. కనుక వీరు ఈత, ఇంట్లోనే సైక్లింగ్ చేసుకోవడం వంటివి ఎంపిక చేసుకోవాలి. ప్రధానంగా కండారాలు బలోపేతం అయ్యే వ్యాయామాలు చేయాలి.

  • Loading...

More Telugu News