Congress: గోవా కాంగ్రెస్ లో తిరుగుబాటు.. బీజేపీలోకి ఆరుగురు ఎమ్మెల్యేలు?
- ఖండించిన గోవా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దినేష్ గుండూరావు
- గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ కు 11 మంది ఎమ్మెల్యేలు
- ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముగిసిన తర్వాత ఇప్పుడు గోవాలో రాజకీయ వేడి మొదలైంది. గోవాలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు మొదలైనట్టు తెలుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే దిగంబర్ కామత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, వాళ్లు అధికార బీజేపీలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు బెబుతున్నాయి. కనీసం ఆరు నుంచి పది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారనే పుకార్ల మధ్య ఆలిండియా ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) గోవా ఇన్‌ఛార్జ్ దినేష్ గుండూరావు రంగంలోకి దిగారు. గోవాలో తమ పార్టీకి చెందిన మొత్తం 11 మంది ఎమ్మెల్యేలను ఈ రోజు సాయంత్రం 6.45 గంటలకు మీడియా ముందుకు తీసుకొస్తామని చెప్పారు.
అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే మైఖేల్ లోబో మాట్లాడుతూ తాను బీజేపీలో చేరడం లేదని చెప్పారు. తమ ఎమ్మెల్యేలపై బీజేపీ గందరగోళం సృష్టిస్తోందని, పుకార్లు పుట్టించిందని ఆరోపించారు. తాను ఇంట్లోనే ఉన్నానని, బీజేపీలో చేరుతున్నానని జరుగుతున్న చర్చల్లో నిజం లేదన్నారు. ఈ పుకార్లను ఎవరు వ్యాప్తి చేస్తున్నారో తెలియదన్న మైఖేల్ తాను కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని స్పష్టం చేశారు. మరోవైపు గోవా కాంగ్రెస్ ఆదివారం తమ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి, తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించింది.
కాగా, ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. 40 మంది సభ్యుల సభలో కాంగ్రెస్‌కు 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీకి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికార బీజేపీకి ఇద్దరు ఎంజీపీ, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
కానీ, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ గెలుపు మార్గాన్ని సులభం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సమచారం. 2019 ఎన్నికల్లో దక్షిణ గోవా లోక్‌సభ సీటును బీజేపీ కోల్పోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే 2024లో ఆ సీటులో మళ్లీ గెలవొచ్చని చూస్తుందని సమాచారం.