AIADMK: అన్నా డీఎంకేలో పళనిస్వామిదే పైచేయి.. పన్నీర్ సెల్వమ్ కు చెక్!
- జంట నాయకత్వాన్ని రద్దు చేసిన పార్టీ
- జనరల్ కౌన్సిల్ భేటీలో నిర్ణయం
- సమావేశం నిర్వహణపై స్టేకు హైకోర్టు నిరాకరణ
- పార్టీ కార్యాలయం ముందు ఇరు వర్గాల మధ్య ఘర్షణ
అన్నాడీఎంకే పార్టీపై ఎడప్పాడి పళనిస్వామి వర్గీయులు పై చేయి సాధించారు. పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. దీంతో సోమవారం సమావేశమైన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా పళనిస్వామిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జయలలిత మరణానంతరం ఇప్పటి వరకు కొనసాగిన పన్నీర్ సెల్వం, పళనిస్వామి జంట నాయకత్వం ముగిసిపోయింది.
కోర్టు తీర్పుతో పళనిస్వామికి అనుకూలత ఏర్పడింది. పార్టీ సమావేశంలో తనకు అనుకూల నిర్ణయానికి పావులు కదిపారు. రెండు నాయకత్వాల విధానాన్ని రద్దు చేసే తీర్మానానికి పార్టీ జనరల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహణపై స్టే కోరుతూ పన్నీర్ సెల్వం హైకోర్టుకు వెళ్లగా, రాజకీయ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమంటూ కోర్టు కొట్టేసింది. దీంతో శాసనసభలో పార్టీ నేతగా పళనిస్వామి వ్యవహరించనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో చెన్నైలో పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గీయులు పరస్పరం ఘర్షణకు దిగారు. కుర్చీలను విసిరేసుకున్నారు.