Raghuram Rajan: భారత్ సరైన ఉద్యోగాలను కల్పించలేకపోతోంది... అగ్నిపథ్ వ్యతిరేక నిరసనలే అందుకు నిదర్శనం: రఘురామ్ రాజన్
- భారత్ పరిస్థితులపై రాజన్ స్పందన
- ఉదారవాద ప్రజాస్వామ్యం అవసరమని వెల్లడి
- అప్పుడే భారత్ విశ్వగురు అవుతుందని వివరణ
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ దేశ పరిస్థితులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. 75 వసంతాల స్వతంత్ర భారతావనిలో ప్రజాసామ్యం, అభివృద్ధి అనే అంశంపై మాట్లాడుతూ, ఉదారవాద ప్రజాస్వామ్యం వేళ్లూనుకున్నప్పుడే భారత్ 'విశ్వగురు' అనిపించుకుంటుందని అన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు, భావజాలంతో భారత్ ఎప్పుడూ అంతర్జాతీయంగా ఎదగలేదని స్పష్టం చేశారు. భారత్ యువతకు సరైన ఉద్యోగాలు కల్పించలేకపోతోందని, అందుకు ఇటీవల అగ్నిపథ్ కు వ్యతిరేకంగా తలెత్తిన నిరసనలే నిదర్శనమని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.
భారత్ లో అభివృద్ధి మందగమనంలో సాగుతుండడానికి కేవలం కరోనా సంక్షోభాన్ని కారణంగా చూపలేమని, పేలవ నాయకత్వం కూడా ఓ కారణమని విశ్లేషించారు. అయితే, ప్రపంచ ఆర్థిక సంక్షోభం, దాని పర్యవసానాల ప్రభావం భారత్ పైనా పడిందని వివరించారు. ఏదేమైనా అత్యంత నాణ్యమైన ఉద్యోగ, ఉపాధి కల్పనలో మనం వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు.