CM Jagan: చిప్ వేలికో, మోకాలికో, అరికాలికో ఉంటే సరిపోదు... బుర్రలో ఉండాలి: చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్
- చంద్రబాబు వేలికి ప్లాటినం ఉంగరం
- ప్రత్యేక చిప్ తో కూడిన ఉంగరం
- ప్లీనరీలో సీఎం జగన్ స్పందన
- చిప్ బుర్రలో ఉంటే మంచి ఆలోచనలు వస్తాయని వ్యాఖ్యలు
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు తన వేలికున్న ప్లాటినం ఉంగరం గురించి వివరించడం తెలిసిందే. దానిపై సీఎం జగన్ సెటైర్ వేశారు. వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ, చిప్ వేలికో, మోకాలికో, అరికాలికో ఉంటే సరిపోదని, బుర్రలో ఉండాలని అన్నారు. అప్పుడే మంచి ఆలోచనలు వస్తాయని, ప్రజలకు మంచి చేయాలన్న బుద్ధి కలుగుతుందని వ్యాఖ్యానించారు. కానీ, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ల వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశామని సీఎం జగన్ వెల్లడించారు. స్థానిక పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు అది నాంది అని పేర్కొన్నారు. చంద్రబాబు ఏనాడైనా ఇలాంటి ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా టీడీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీ ఒక పెత్తందారీ పార్టీ అని పేర్కొన్నారు. పేదల పట్ల సానుకూల దృక్పథం ఆ పార్టీ భావజాలంలో ఎక్కడా కనిపించదని అన్నారు. చంద్రబాబు సిద్ధాంతం వెన్నుపోటు అని, అప్పుడు ఎన్టీఆర్ కు, ఆ తర్వాత ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.