Maharashtra: నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు: పోలీసులకు మహారాష్ట్ర సీఎం షిండే ఆదేశం
- ముంబై పోలీస్ కమిషనర్‌తో భేటీ అయిన షిండే
- వీఐపీల సెక్యూరిటీపై చర్చ
- తమది సామాన్యుల ప్రభుత్వమని చెప్పిన షిండే
- తన మార్గంలో భద్రతను తగ్గించాలని ఆదేశం
ముఖ్యమంత్రి హోదాలో తాను ప్రయాణించే కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను నిలిపివేయాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర నూతన సీఎం ఏక్‌నాథ్ షిండే రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా తన కాన్వాయ్‌కు ప్రత్యేకంగా ఏ ప్రొటోకాల్ కూడా అవసరం లేదని ఆయన సూచించారు. ఈ మేరకు ముంబై పోలీస్ కమిషనర్‌కు షిండే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
శుక్రవారం ముంబై పోలీస్ కమిషనర్‌తో సమావేశమైన సందర్భంగా షిండే ఈ నిర్ణయం తీసుకున్నారు. వీవీఐపీల ప్రయాణాల కోసం సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఈ సందర్భంగా షిండే వ్యాఖ్యానించారు. ప్రజలకు కలుగుతున్న ఈ ఇబ్బందిని తొలగించేందుకు సీఎం కాన్వాయ్‌కు ఎలాంటి ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. అంతేకాకుండా తాను ప్రయాణించే మార్గంలో భద్రతను కూడా తగ్గించాలని ఆయన సూచించారు. తమది సామాన్యుల ప్రభుత్వమని.. ఈ కారణంగానే వీఐపీల కన్నా... సామాన్యులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నామని ఆయన చెప్పారు.