YS Vijayamma: అప్పుడు జగన్ కు పద్నాలుగేళ్లు ఉంటాయేమో...!: విజయమ్మ
- వైసీపీ ప్లీనరీ ప్రారంభం
- అట్టహాసంగా పార్టీ పండుగ
- హాజరైన అధినాయకత్వం
- గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ ప్రసంగం
- తన బిడ్డ జగన్ గురించి ఆసక్తికర అంశం వెల్లడి
గుంటూరు జిల్లా నాగార్జున వర్సిటీ సమీపంలో వైసీపీ ప్లీనరీ ఘనంగా ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ ఆసక్తికర ప్రసంగం చేశారు. తన బిడ్డ జగన్ రాజకీయాల్లోకి రావాలన్నది అనూహ్య నిర్ణయం కాదని స్పష్టం చేశారు. తండ్రి బాటలో పయనించాలని విద్యార్థి దశలోనే నిర్ణయించుకున్నాడని తెలిపారు.
"అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ ఇంట్లో ఉండేవారు కాదు. రాజకీయాలతో జిల్లాల్లో తిరుగుతుండేవారు. జగన్ అప్పుడు చిన్నవాడు. పదో తరగతి చదువుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి వారానికి ఒకసారైనా ఇంటికి వచ్చి మాతో గడిపిన సందర్భాలు చాలా తక్కువ.
దాంతో నేను జగన్ తో ఇలా అన్నాను... నాన్నా, నువ్వు తండ్రిలా రాజకీయాల్లోకి వెళ్లొద్దు... నాలుగు ఇండస్ట్రీలు పెట్టుకుని, కాలు మీద కాలేసుకుని దర్జాగా బతకాలి. పదిమందికి ఉపయోగపడినట్టు ఉంటుంది అని చెప్పాను. రాజకీయ జీవితం వద్దు, వ్యాపార జీవితం ఎంచుకో అని అన్నాను. అప్పుడు జగన్ కు పద్నాలుగు, పదిహేనేళ్ల వయసుంటుందేమో.... ఇలా అన్నాడు నాతో... అమ్మా, ఇలాంటి లైఫ్ కాదమ్మా నేను కోరుకునేది. నాన్న ఏ బాటలో నడుస్తున్నాడో, నేను కూడా అదే బాటలో నడుస్తాను అన్నాడు. కష్టాలకు వెనుదీయను అన్నాడు.
ఆ సమయంలో తల్లిగా బాధపడ్డాను. బిడ్డ సుఖంగా ఉండాలనే కోరుకున్నాను. కానీ ఇవాళ జగన్ సంపాదించిన అభిమానం చూసి తల్లిగా గర్విస్తున్నా. తన మనసుతో చేసే ఈ పరిపాలనను కళ్లారా చూస్తున్నా. ఇంతకంటే ఇంకే కావాలి?" అంటూ విజయమ్మ భావోద్వేగాలకు లోనయ్యారు.