Bhagwant Mann: తనకంటే 16 ఏళ్లు చిన్నదైన వైద్యురాలిని పెళ్లాడిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్... పెళ్లికి హాజరైన కేజ్రీవాల్
- రెండో పెళ్లి చేసుకున్న భగవంత్ మాన్
- చండీగఢ్ లో సిక్కు సంప్రదాయాల ప్రకారం పెళ్లి
- వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన కేజ్రీవాల్
- 2015లో మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన మాన్
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. హర్యానాకు చెందిన 32 ఏళ్ల గుర్ ప్రీత్ కౌర్ తో ఆయన వివాహం నేడు జరిగింది. ఈ పెళ్లికి చండీగఢ్ లోని భగవంత్ మాన్ నివాసం వేదికగా నిలిచింది. కొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం సిక్కు సంప్రదాయాల ప్రకారం జరిగింది.
ఈ పెళ్లికి ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అయితే, ఈ పెళ్లికి ఏ ఒక్క పంజాబ్ మంత్రిని, ప్రముఖ నేతలను పిలవలేదని తెలుస్తోంది. అందుకే పెళ్లిలో ఎలాంటి రాజకీయ సందడి కనిపించలేదు. అయితే ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధాకు మాత్రం ఆహ్వానం వెళ్లింది.
భగవంత్ మాన్ వయసు 48 ఏళ్లు కాగా, ఆయన కంటే గుర్ ప్రీత్ 16 ఏళ్లు చిన్నది. 2015లో భగవంత్ మాన్ మొదటి భార్య ఇందర్ ప్రీత్ కౌర్ కు విడాకులు ఇచ్చారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఇందర్ ప్రీత్ కౌర్ తన పిల్లలు సీరత్ కౌర్ మాన్ (21), దిల్షాన్ మాన్ (17)లతో కలిసి అమెరికాలో ఉంటున్నారు.
ఇక డాక్టర్ గుర్ ప్రీత్ తో సీఎం భగవంత్ మాన్ కు చాన్నాళ్లుగా పరిచయం ఉంది. ఇరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం కూడా ఉంది. గత ఎన్నికల సమయంలోనూ మాన్ కు ఆమె ఎంతగానో సహకారం అందించారు. మొహాలీలో ఆమె వైద్యురాలిగా సేవలు అందిస్తున్నారు.