Kaali poster: తీరు మార్చుకోని మణిమేకలై.. మరోసారి అభ్యంతరకర పోస్టర్ విడుదల
- పరమేశ్వరుడు, అమ్మవారి వస్త్రధారణలో వ్యక్తులు
- సిగరెట్ తాగుతున్న ఫొటో ను షేర్ చేసిన మేకలై
- మరో కొత్త వివాదానికి ఆజ్యం
కెనడాలో శరణార్థి జీవితం గడుపుతున్న నిర్మాత, దర్శకురాలు లీనా మణిమేకలై తన 'కాళీ' సినిమా పోస్టర్ తో కాళికామాతను అవమానకర రీతిలో చూపించిన వివాదం ఇంకా సమసిపోలేదు. ఈ లోపు ఆమె మరోసారి హిందూ దేవతల పట్ల తన చులకన భావాన్ని చాటుకుంది.
కాళి సినిమా పోస్టర్ లో.. కాళికామాత సిగరెట్ తాగుతున్నట్టు ఆమె ఇంతకుముందు చూపించడం తెలిసిందే. దీనిపై ఢిల్లీ, యూపీ సహా పలు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. కెనడాలో భారత హైకమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ట్విట్టర్.. కాళి పోస్టర్ ను, దానికి సంబందించిన ట్వీట్ ను తన ప్లాట్ ఫామ్ నుంచి తొలగించింది.
తాజాగా గురువారం లీనా మణిమేకలై మరో ఫొటోను పోస్ట్ చేసింది. ఈసారి పరమేశ్వరుడు, అమ్మవారు కాస్ట్యూమ్స్ ధరించిన ఇద్దరు వ్యక్తులు పొగతాగడాన్ని చూపిస్తున్నట్టుగా ఉంది. ‘వేరే చోట’ అంటూ దానికి మేకలై క్యాప్షన్ పెట్టింది. కాళి పోస్టర్ లో కనిపిస్తోంది టొరంటోలో సంచరించే ఓ స్త్రీ అంటూ మేకలై సమర్థించుకోవడం తెెలిసిందే. ఆమె తీరు చూస్తుంటే ఇదంతా ప్రచారం కోసం కావాలనే చేస్తున్నట్టుగా ఉంది.