USA: షికాగోలో స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై కాల్పులు.. ఆరుగురి మృతి
- 36 మందికి పైగా గాయాలు
- శక్తిమంతమైన రైఫిల్‌తో నిందితుడి కాల్పులు
- షాకయ్యానన్న అధ్యక్షుడు జో బైడెన్
అమెరికాలోని షికాగోలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌పై ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 36 మందికిపైగా గాయపడ్డారు. షికాగో శివారులోని హైలాండ్ పార్క్‌లో నిన్న జరిగిన పరేడ్‌పై అత్యంత శక్తిమంతమైన రైఫిల్‌తో ఓ వ్యక్తి పైకప్పు నుంచి కాల్పులు జరిపాడు.
ఈ ఘటనకు సంబంధించి గత రాత్రి రాబర్ట్ ఇ.క్రిమో 3 అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడి కారును చుట్టుముట్టినప్పుడు కారు నుంచి దిగి చేతులు పైకెత్తిన నిందితుడి వీడియోను స్థానిక మీడియా విడుదల చేసింది. నిందితుడు క్రిమోపై పలు అభియోగాలు మోపినట్టు హైలాండ్ పార్క్ పోలీసులు తెలిపారు.
ప్రశాంతంగా జరుగుతున్న పరేడ్‌పై ఒక్కసారిగా కాల్పులు జరగడంతో జనం భయంతో పరుగులు తీశారు. పెద్ద ఎత్తున బాణసంచా పేలుతున్నట్టు అనిపించిందని ప్రత్యక్ష సాక్షి అయిన రిటైర్డ్ వైద్యుడు రిచర్డ్ కౌఫ్‌మన్ తెలిపారు. దాదాపు 200 షాట్లను విన్నట్టు చెప్పారు. కాల్పులు జరిగిన వెంటనే ప్రజలు భయంతో పరుగులు తీశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే తాను, తన భార్య జిల్ షాకైనట్టు చెప్పారు.