Team India: పంత్ అంత గొప్పగా ఆడితే.. అలాంటి హెడ్డింగ్ పెడతారా అంటూ ఇంగ్లండ్ బోర్డుపై దినేశ్ కార్తీక్ ఆగ్రహం
- ఇంగ్లండ్ తో ఐదు టెస్టు తొలి టెస్టులో పంత్ అద్భుత ఇన్నింగ్స్
- చివరకు జో రూట్ బౌలింగ్ లో ఔటైన రిషబ్
- తొలి రోజు హైలైట్స్ వీడియోకు పంత్ ను ఔట్ చేసిన రూట్ అని హెడ్డింగ్ పెట్టిన ఈసీబీ
- అంతకుమించిన హెడ్ లైన్ తట్టలేదా అంటూ కార్తీక్ సెటైర్
భారత క్రికెట్లో రిషబ్ పంత్ చాలా ప్రత్యేకమైన ఆటగాడు. వికెట్ కీపర్ బ్యాటర్ గా జట్టులోకి వచ్చిన పంత్ ఇప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా ఆడుతున్నాడు. ఎప్పుడూ దూకుడైన ఆటతో ప్రత్యర్థి బ్యాటర్లపై అతను మానసిక పైచేయి సాధించే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు తక్కువ స్కోర్లకే ఔటైనా.. పంత్ మాత్రం తన శైలి మార్చుకోవడం లేదు. అదే అతడిని ఈ స్థాయికి తీసుకొచ్చింది.
మిగతా బ్యాటర్లు చేతులెత్తేసిన సమయంలో రిషబ్ చాలా సందర్భాల్లో జట్టును ఆదుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులోనూ సీనియర్లంతా పెవిలియన్ చేరి 98 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన జట్టుకు ఆపద్బాందవుడయ్యాడు. ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ 111 బంతుల్లో 146 పరుగులు చేశాడు. జడేజాతో కలిసి 222 రన్స్ జోడించి ఇంన్నింగ్స్ ను నిలబెట్టాడు.
చివరకు 146 పరుగుల వద్ద పంత్ ను జో రూట్ ఔట్ చేశాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ మొదటి రోజు హైలెట్స్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ యూట్యూబ్‌లో చానల్లో పెట్టింది. కానీ, ఇంత గొప్ప ఇన్నింగ్స్ ఆడిన పంత్ ఫోటోను పెట్టలేదు. పైగా, రిషబ్ పంత్‌ను ఔట్ చేసిన రూట్ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ హెడ్ లైన్ చూసిన టీమిండియా సీనియర్ బ్యాటర్ దినేష్ కార్తీక్.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుపై ట్విట్టర్ లో సెటైర్స్ వేశాడు.
రిషబ్ పంత్ రోజంతా అంత అద్భుతమైన, అలరించేలా ఆడినప్పుడు ఇంగ్లండ్ బోర్డు ఇంతకంటే మంచి హెడ్ లైన్ పెట్టొచ్చని అభిప్రాయపడ్డాడు. రెండు జట్ల మధ్య నాణ్యమైన ఆట ఎంత బాగుందో పంత్ గొప్ప ఇన్నింగ్స్ అంత గొప్పగా ఉందన్నాడు. కానీ, తొలి రోజు ఆటను ఇలానా చూపించేది అని ట్వీట్ చేశాడు.