Dangerous Garden: ప్రాణాలపై ఆశ లేకుంటేనే ఆ గార్డెన్ లోకి వెళ్లాలి.. అక్కడ ప్రతి మొక్క ప్రాణాంతకమే..
- ‘ఈ మొక్కలు మిమ్మల్ని చంపగలవు’ అంటూ గార్డెన్ గేటు వద్దే బోర్డు
- అత్యంత విష పూరితమైన 100కుపైగా మొక్కలకు కేంద్రం
- గార్డెన్ లో నడుస్తూ మొక్కల వాసనకే స్పృహ తప్పిపోయే కొందరు
- అత్యంత జాగ్రత్తలతో పర్యాటకులకు అనుమతి
అదో అందమైన ఉద్యాన వనం.. విశాలమైన స్థలంలో పెద్ద సంఖ్యలో చెట్లు, మొక్కలతో అలరారుతుంది. కానీ అందులోనే ఓ మూలన విడిగా చిన్న సైజు ఉద్యాన వనం ఉంటుంది. చుట్టూ ఫెన్సింగ్ తో ఎవరూ లోపలికి రాకుండా పకడ్బందీగా ఉంటుంది. ఒకే ఒక్క గేటు నుంచి అదీ అత్యంత జాగ్రత్తలతో లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉద్యాన వనం. అందులో ఉండే వన్నీ అత్యంత విషపూరితమైన మొక్కలు మరి. అసలు దాని గేటు మీదే ‘ఈ మొక్కలు మిమ్మల్ని చంపే అవకాశం ఉంటుంది’ అన్న పెద్ద హెచ్చరిక బోర్డు కూడా ఉంటుంది.
ఎక్కడుంది? ఎందుకిలా..?
ఇంగ్లాండ్ లోని నార్తంబర్ లాండ్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రమాదకర ఉద్యాన వనం పేరు ‘ఆల్నివిక్ గార్డెన్’. గతంలో బ్రిటిష్ రాచ కుమార్తెల్లో ఒకరు ఉద్యాన వనాన్ని ఏర్పాటు చేయించాలని భావించారు. కానీ సాధారణంగా చేస్తే ఏముంటుందని.. అరుదైన, విషపూరిత మొక్కలతో ఉద్యాన వనాన్ని ఏర్పాటు చేయించారు.
- ఈ ఉద్యాన వనంలో 100కుపైగా విష పూరిత మొక్కలు ఉన్నాయి. తీవ్ర మానసిక విభ్రమలకు కారణమయ్యే నార్కోటిక్ మొక్కలూ ఇందులో ఉన్నాయి.
- కొన్ని రకాల మొక్కలను ముట్టుకుంటే విషపూరితం కాగా.. మరికొన్నింటిని వాసన చూసినా ప్రమాదకరమేనని ఉద్యాన వనం నిర్వాహకులు హెచ్చరిస్తుంటారు.
- ‘జియాంట్ హాగ్ వీడ్’ అనే మొక్క ఆకులను ముట్టుకుంటే.. చేతులపై చర్మం కమిలిపోతుంది. ఆరేడు ఏళ్ల వరకు ఆ మచ్చలు కూడా పోవు.
- లారెల్ అనే మొక్క నుంచి సైనైడ్ ఉత్పత్తి అవుతుంది. కేవలం కొద్ది సెకన్లలోనే ప్రాణాలు తీసేయగల రసాయనం సైనైడ్.
- ‘బ్లూ మాంక్స్ హుడ్’ మొక్క పూల నుంచి ఆకులు, కాండం, పండ్ల దాకా అన్నీ విష పూరితమే. దాని వాసన చూసినా స్పృహ తప్పిపోతారు.
పూర్తిగా కవర్ చేసుకున్నాకే లోపలికి..
‘ఆల్నివిక్ గార్డెన్’ లోనికి అత్యంత జాగ్రత్తల మధ్య మాత్రమే అనుమతిస్తారు. గ్లౌజులు, బూట్లతోపాటు పూర్తిగా శరీరాన్ని కప్పి ఉంచే డ్రెస్ ధరించాల్సి ఉంటుంది. సందర్శకులకు తోడుగా ఒక గైడ్ తప్పనిసరిగా ఉంటారు. ఏ మొక్క ఏమిటి? దానితో ప్రమాదం ఏమిటనేది వివరిస్తుంటారు. ఈ ఉద్యాన వనాన్ని సందర్శించేందుకు వచ్చిన వారిలో కొందరు ఇక్కడి మొక్కల నుంచి వెలువడే వాయువులను పీల్చడం వల్ల స్పృహ తప్పి పడిపోతుంటారు కూడా.