Monsoon: దేశవ్యాప్తంగా విస్తరించిన రుతు పవనాలు.. ఇక వర్షాలు వరుణుడి వంతు

Monsoon has covered entire country IMD

  • శనివారం నాటికి విస్తరణ పూర్తయినట్టు వాతావరణ శాఖ ప్రకటన
  • ఆరు రోజుల ముందే విస్తరించినట్టు వెల్లడి
  • అల్పపీడనాలు తోడైతే భారీ వర్షాలకు అవకాశం

నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయంలోనే దేశవ్యాప్తంగా విస్తరించాయి. దీంతో గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నట్టు భారత వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ‘‘నైరుతి రుతుపవనాలు శనివారం నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాయి. సాధారణ గడువు అయిన జులై 8 కంటే ఆరు రోజులు ముందు రుతుపవనాల విస్తరణ పూర్తయింది’’అంటూ వాతావరణ శాఖ తెలిపింది. 

నైరుతి రుతువపనాలు మూడు రోజులు ముందుగానే మే 29న కేరళ తీరాన్ని తాకాయి. భారత్ సాగు ఆధారిత దేశం. ఇప్పటికీ కోట్లాది మందికి జీవనోపాధి వ్యవసాయమే. సాగుకు నైరుతి రుతుపవనాలు ఎంతో కీలకం. సాధారణ వర్షపాతం నమోదు అయితే పంటలు సమృద్ధిగా పండి, మంచి దిగుబడి సాధ్యపడుతుంది. 130 కోట్లకు పైగా భారతీయుల ఆహార అవసరాలు తీరాలంటే తగినన్ని వర్షాలు పడాలి. అది కూడా ఈశాన్య, నైరుతి రతుపవనాల్లో నైరుతియే దాదాపు దేశ నీటి అవసరాలను ఎక్కువగా తీరుస్తుంది.  

రుతు వపనాల విస్తరణ పూర్తయింది కనుక అవి చురుగ్గా మారి వర్షాలు పడాల్సి ఉంది. జూన్ నెలకు అయితే 9 శాతం వరకు లోటు నమోదైంది. సముద్ర ఉపరితల వాతావరణం వర్షాలను నిర్ధేశిస్తుంటుంది. అల్పపీడనాల మద్దతుతో రుతుపవనాలు బలోపేతం అయితేనే భారీ వర్షాలు సాధ్యపడతాయి. రానున్న రోజుల్లో రుతుపవనాలు చురుగ్గా మారతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News