Meena: భర్త దూరమయ్యారనే బాధలో నేనుంటే... అసత్య వార్తలు బాధాకరం: నటి మీనా ఆవేదన
![actress meena emotional statement on fake news over her husband death](https://imgd.ap7am.com/thumbnail/cr-20220701tn62beea2c91e6c.jpg)
- ఇకనైనా అసత్య వార్తలు రాయొద్దంటూ మీడియాకు మీనా విజ్ఞప్తి
- తన కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించవద్దంటూ వేడుకోలు
- విద్యా సాగర్ ప్రాణాలను కాపాడేందుకు తమిళనాడు సీఎం, మంత్రి శాయశక్తులా కృషి చేశారని వెల్లడి
నటి మీనా తన భర్త విద్యా సాగర్ మరణంపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారంపై విచారం వ్యక్తం చేశారు. భర్త దూరమయ్యారనే బాధలో తానుంటే... అదేమీ పట్టించుకోకుండా తన భర్త మరణంపై అసత్య వార్తలను ప్రసారం చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సదరు అసత్య వార్తలను నిలిపివేయాలంటూ ఆమె సోషల్ మీడియా వేదికగానే ఓ భావోద్వేగ ప్రకటన చేశారు.
మీనా ఇంటికి సమీపంలో పెద్ద సంఖ్యలో పావురాలు ఉంటాయని, వాటి వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చిన కారణంగానే విద్యా సాగర్‌కు శ్వాస సంబంధ సమస్యలు వచ్చాయని, ఈ క్రమంలోనే ఆయన మరణించారంటూ పలు వార్తా సంస్థలు వార్తలు రాశాయి. ఈ వార్తలపై తాజాగా మీనా స్పందించారు.
తన పరిస్థితిని అర్థం చేసుకుని తన కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించరాదని సదరు ప్రకటనలో మీడియాను మీనా కోరారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపిన మీనా... తన భర్త ప్రాణాలను కాపాడేందుకు తమిళనాడు సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులు శాయశక్తులా కృషి చేశారని కూడా ఆమె పేర్కొన్నారు.