Himanta Biswa: దేవేంద్ర ఫడ్నవిస్ నిస్వార్థ మనిషి: అసోం సీఎం

Himanta Biswa praises Fadnavis selflessness

  • ఫడ్నవీస్ పాత్రపై అసోం సీఎం హిమంత ప్రశంసలు 
  • మహారాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తారని ట్వీట్
  • స్వయంసేవక్ విలువలు అర్థమయ్యేలా చేశారన్న నితేష్ రాణే

మహారాష్ట్రలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు కాగా.. దీని వెనుక చక్రం తిప్పిన వారిలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఉన్నారు. శివసేన అసమ్మతి నేత ఏక్ నాథ్ షిండే, తన మద్దతుదారులతో వారం రోజుల పాటు అసోం రాజధాని గువాహటిలోని ఓ స్టార్ హోటల్లో బస చేయడం తెలిసిందే. వారు ఉన్నన్నాళ్లూ బయటి వ్యక్తులను ఎవరినీ హోటల్లోకి అనుమతించ లేదు. ఒక్క అసోం సీఎం మాత్రమే పలు మార్లు వెళ్లి మంతనాలు నిర్వహించారు. ఒక విధంగా బీజేపీ వ్యూహాలను ఆయన అక్కడ అమలు చేయగలిగారు. 

మరోపక్క, మహారాష్ట్ర ప్రస్తుత డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ పోషిస్తున్న పాత్ర పట్ల అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రశంసలు కురిపించారు. ఫడ్నవిస్ నిస్వార్థ వ్యక్తిత్వం ఆదర్శనీయమన్నారు. ‘‘మీ రాష్ట్రం ప్రగతి దిశగా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడంలో మీరు తప్పకుండా కీలక పాత్ర పోషిస్తారు’’ అని హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. 

గత రాత్రి షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం చేయడం తెలిసిందే. డిప్యూటీ సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే బిశ్వశర్మ ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన ఫడ్నవిస్ కు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నేత నితేష్ రాణే సైతం ఫడ్నవిస్ పాత్రను ప్రశంసించారు. స్వయంసేవక్ విలువలు అర్థం చేసుకునేందుకు తాను ఎన్నో ఆర్ఎస్ఎస్ పుస్తకాలు చదివానని, స్వయం సేవక్ అంటే ఎంటో ఫడ్నవిస్ అర్థమయ్యేలా చేశారంటూ ట్వీట్ చేశారు. 


Himanta Biswa
praises
Fadnavis
selflessness

More Telugu News