Maharashtra: అన్న ఉద్ధవ్ రాజీనామాపై తమ్ముడు రాజ్ థాకరే పరోక్ష కామెంట్ ఇదే!
- అదృష్టాన్ని విజయంగా భావిస్తే పతనం మొదలైనట్టేనన్న రాజ్
- ఉద్ధవ్ రాజీనామాపైనే ఆ వ్యాఖ్య అంటూ విశ్లేషణలు
- బల పరీక్షలో బీజేపీకే మద్దతు ప్రకటించిన ఎంఎన్ఎస్ చీఫ్
ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే... అన్నాదమ్ముల పిల్లలే. శివసేన బాల్ థాకరే బతికున్నంత కాలం కలిసే ఉన్నారు. బాల్ థాకరే మరణించిన కొన్నాళ్లకు అన్న ఉద్ధవ్ థాకరేతో విభేదించిన తమ్ముడు రాజ్ థాకరే వేరు కుంపటి పెట్టేసుకున్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్)పేరిట రాజ్ థాకరే పెట్టిన పార్టీ పెద్దగా రాణించలేదు. ఫలితంగా రాజకీయంగా రాజ్ థాకరే అంతగా యాక్టివేట్ కాలేకపోయారు. అయితే తన సోదరుడు ఉద్ఢవ్ మహారాష్ట్ర సీఎం పదవికి బుధవారం రాత్రి రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఈ ఘటనపై స్పందిస్తూ రాజ్ థాకరే గురువారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఒక వ్యక్తి తన అదృష్టాన్ని సొంత విజయంగా భావించిన నాటి నుంచే అతని పతనం మొదలవుతుంది అంటూ సదరు ట్వీట్‌లో రాజ్ థాకరే పేర్కొన్నారు. ఈ ట్వీట్‌లో ఆయన ఉద్ధవ్ థాకరే పేరును ఎక్కడా ప్రస్తావించకపోయినా... మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, సీఎం పదవిని కాపాడుకోలేక ఉద్ధవ్ రాజీనామా చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్ గురించే రాజ్ థాకరే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో అసెంబ్లీలో జరగాల్సిన బల పరీక్షలో రాజ్ థాకరే తన మద్దతును బీజేపీ, షిండే వర్గానికి ప్రకటించిన సంగతి తెలిసిందే.