stocks: ఈ షేర్లు మీ దగ్గరుంటే.. డివిడెండ్ల వర్షమే
- ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ రేటు
- ప్రభుత్వ రంగ సంస్థలే ఎక్కువ
- వీటిల్లో పెట్టుబడులతో స్థిరమైన డివిడెండ్ ఆదాయం
ఒక షేరులో పెట్టుబడి పెట్టిన తర్వాత.. కొంత కాలానికి షేరు ధర పెరిగితే వచ్చేది మూలధన లాభం. ఒక షేరు కొనుగోలు చేసి, విక్రయించే వరకు ఏటా ఆ కంపెనీ నుంచి అందుకునే డివిడెండ్ ఆదాయం అదనపు రాబడి. ఇలా వాటాదారులకు మంచి డివిడెండ్లు ఇచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇతర కంపెనీలతో పోలిస్తే ఇలా అధిక డివిడెండ్ల వర్షం కురిపించే కంపెనీల స్టాక్ ధరల్లో వేగవంతమైన వృద్ధి కనిపించదు.
ఇక ఫిక్స్ డ్ డిపాజిట్ కు ఏ మాత్రం తీసిపోని, ఎఫ్ డీ కంటే ఎక్కువ డివిడెండ్ ఇచ్చే కంపెనీలు కొన్ని ఉన్నాయి. ప్రతి ఇన్వెస్టర్ తన ఈక్విటీ పెట్టుబడుల్లో 5-10 శాతం మేర డివిడెండ్ ఎక్కువగా ఇచ్చే కంపెనీల్లో పెట్టుకోవడం వల్ల అదనపు రాబడి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన.
- ఆర్ ఈసీ: విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులకు రుణాలు సమకూర్చే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇది. కేవలం 2.3 పీఈకే ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం 13.8 శాతం డివిడెండ్ రాబడి వద్ద ఈ స్టాక్ ధర ట్రేడ్ అవుతోంది. అంటే పెట్టిన పెట్టుబడిని ఎనిమిదేళ్లలోనే తిరిగి పొందొచ్చు.
- సెయిల్: ప్రభుత్వరంగ మెగా స్టీల్ కంపెనీ ఇది. ఇటీవల మెటల్ కంపెనీలు అమ్మకాల ఒత్తిడిని చూస్తుండడంతో ఈ స్టాక్ కూడా దిద్దుబాటుకు గురైంది. ప్రస్తుతం ఈ షేరు ధర ప్రకారం చూస్తే డివిడెండ్ రాబడి 13.5 శాతంగా ఉంది.
- పీఎఫ్ సీ: ఇది కూడా విద్యుత్ రంగానికి రుణాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ రంగ ఎన్ బీఎఫ్ సీ. ఆర్ ఈసీ ప్రమోటర్ ఇదే. 12.2 శాతం డివిడెండ్ రాబడితో లభిస్తోంది.
- పీటీసీ ఇండియా: ఇది కూడా ప్రభుత్వ రంగ సంస్థే. దీని డివిడెండ్ ఈల్డ్ 10.4 శాతంగా ఉంది.
- కోల్ ఇండియా: బొగ్గు రంగంలో దిగ్గజ ప్రభుత్వరంగ సంస్థ. దీని డివిడెండ్ ఈల్డ్ ప్రస్తుతం 9.6 శాతంగా ఉంది.
- పీఎన్ బీ గిల్ట్స్: పంజాబ్ నేషనల్ బ్యాంకు సబ్సిడరీ ఇది. ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్లో ప్రైమరీ డీలర్. ఈ స్టాక్ డివిడెండ్ ఈల్డ్ 8.5 శాతంగా ఉంది.
- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్: ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీల్లో దిగ్గజ సంస్థ ఇది. దీని డివిడెండ్ ఈల్డ్ 8.2 శాతంగా ఉంది.
- ఓఎన్జీసీ: చమురు అన్వేషణ, ఉత్పత్తిలో భారత్ లో అతిపెద్ద సంస్థ ఇది. దీని డివిడెండ్ రాబడి రేటు 7.8 శాతంగా ఉంది.
- రైట్స్: భారతీయ రైల్వేకు సంబంధించిన కన్సల్టెన్సీ సంస్థ ఇది. దీని డివిడెండ్ ఈల్డ్ రేటు 7.5 శాతంగా ఉంది.