Rahul Gandhi: జీఎస్టీ ఇక ‘గృహ సర్వనాశన ట్యాక్స్’.. పన్ను పరిధిలోకి మరిన్ని వస్తువులు తేవడంపై రాహుల్ గాంధీ ఫైర్
- ఇప్పటికే దేశంలో ఉపాధి తగ్గిందన్న రాహుల్
- ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్య
- మళ్లీ జీఎస్టీ పేరుతో కుటుంబాలను దెబ్బతీస్తున్నారని మండిపాటు
కేంద్ర ప్రభుత్వం మరిన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తేవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటివరకు ‘ప్రధాన మంత్రి గబ్బర్ సింగ్ ట్యాక్స్’గా ఉన్న జీఎస్టీ.. దీనితో ‘గృహస్తీ సర్వ నాశన్ ట్యాక్స్ (ఇళ్లను నాశనం చేసే పన్ను)’గా మారిందని విమర్శించారు.
తక్కువ ధర ఉన్న హోటల్ వసతి, ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్యాకేజ్డ్ మాంసం, చేపలు, పెరుగు, తేనె, పన్నీర్ లతోపాటు లేబుల్డ్ (బ్రాండ్ల పేరుమీద అమ్మే) ఆహార వస్తువులపైనా పన్ను విధించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
“ఇప్పటికే దేశంలో ఉపాధి తగ్గిపోయింది. ఇంకోవైపు ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కుటుంబాలను నాశనం చేసేలా జీఎస్టీ విధిస్తున్నారు..” అని రాహుల్ మండిపడ్డారు.