Tollywood: విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీకి సినిమాలు: టాలీవుడ్ నిర్మాతల కీలక నిర్ణయం
- ఓటీటీలో త్వరితగతిన సినిమాలతో నష్టమన్న బన్నీ వాసు
- సినిమాల ఓటీటీ రిలీజ్‌పై నిర్మాతల సమావేశం
- జులై 1 తర్వాత ఒప్పందాలు జరిగే సినిమాలకే కొత్త నిబంధన అన్న నిర్మాతలు
ఓటీటీలోకి తెలుగు సినిమాల ఎంట్రీపై టాలీవుడ్ నిర్మాతలు బుధవారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాత మాత్రమే సినిమాలను ఓటీటీకి ఇవ్వాలని నిర్మాతలు తేల్చారు. ఈ మేరకు బుధవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే జులై 1 తర్వాత ఒప్పందాలు జరిగే సినిమాలకే ఈ నిబంధన వర్తింపజేయాలని కూడా వారు నిర్ణయించారు.
ఓటీటీలోకి త్వరితగితిన సినిమాలు విడుదల అవుతుండటంతో అగ్ర హీరోలకు భారీ నష్టం జరుగుతోందని, వారి ఇమేజీ కూడా తగ్గిపోతోందని టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు మంగళవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు నిర్మాతలు బుధవారం సమావేశం కానున్నట్లు కూడా ఆయన నిన్ననే ప్రకటించారు. బన్నీ వాసు వాదన మేరకే టాలీవుడ్ నిర్మాతలు బుధవారం భేటీ అయి ఈ నిర్ణయం తీసుకున్నారు.