Disease X: ప్రపంచం ముంగిట మరో ముప్పు.. ‘డిసీజ్ ఎక్స్’ తప్పదని హెచ్చరిక!
- భవిష్యత్తులో విరుచుకుపడే ఊహాజనిత వైరస్‌ను ‘డిసీజ్ ఎక్స్’తో పోలుస్తారు
- ప్రస్తుత వైరస్‌ల కంటే వినాశకారి కావొచ్చంటున్న నిపుణులు
- ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు
మూడేళ్ల క్రితం ఈ ప్రపంచంపై కరోనా మహమ్మారి దాడి చేసింది. ఆ తర్వాతి నుంచి మరెన్నో వైరస్‌లు ప్రజలను లక్ష్యంగా చేసుకున్నాయి. మంకీపాక్స్, క్రిమియన్-కాంగో ఫీవర్, బర్డ్ ఫ్లూ, లాస్సా ఫీవర్ వంటివి ప్రజలను భయపెట్టాయి. కరోనా వైరస్ పలు రకాలుగా రూపాంతరాలు చెందుతూ ఇప్పటికీ భయపెడుతూనే ఉంది.
ఇక ఇప్పుడు వీటన్నింటికంటే ప్రమాదకరమైన ‘డిసీజ్ ఎక్స్’ ప్రపంచంపై దాడికి సిద్ధంగా ఉందని బ్రిటన్ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. దీనిని ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. బ్రిటన్‌లోని మురికినీటి నమూనాల్లో ఇటీవల పోలియో వైరస్‌ను గుర్తించారు. అయితే, పోలియో వ్యాక్సిన్‌ను ఇప్పటికే విస్తృతంగా పంపిణీ చేయడంతో దాని నుంచి ముప్పు తప్పినా ‘డిసీజ్ ఎక్స్’ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
‘డిసీజ్ ఎక్స్’ అనేది వైరస్ కాదు. భవిష్యత్తులో వచ్చే మహమ్మారికి కారణమయ్యే వైరస్‌ను ఇలా సూచిస్తారు. ఊహాజనితమైన అంటువ్యాధి ఇది. ఒకవేళ ఇది వస్తే మాత్రం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యాధికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే చెప్పింది. కొవిడ్ కంటే తీవ్రమైన కొత్త వ్యాధులు వస్తాయని 1976లో ఎబోలా వైరస్‌ను కనుగొనడంలో కీలక పాత్ర పోషించిన ప్రాఫెసర్ జీన్‌జాక్యూస్ ముయెంబే టామ్‌ఫమ్ గతేడాదే చెప్పడం గమనార్హం.