Stingray: ప్రపంచంలోనే అతిపెద్ద టేకు చేప మెకాంగ్ నదిలో లభ్యం... జలరాకాసి ఫొటోలు ఇవిగో!
- ఆసియాలో మూడో అతిపెద్ద నది మెకాంగ్
- ఆరు దేశాల గుండా ప్రవహించే నది
- జూన్ 13న మత్స్యకారుల వలలో భారీ స్టింగ్ రే
- 13 అడుగుల పొడవున్న చేప
- గిన్నిస్ బుక్ లో స్థానం
ఆసియాలోని అతిపెద్ద నదుల్లో మూడోది మెకాంగ్ నది. ఇది వియత్నాం, థాయ్ లాండ్, కాంబోడియా, చైనా, లావోస్, మయన్మార్ దేశాల గుండా ప్రవహిస్తుంది. ఇందులో అనేక రకాల జీవజాతులు దర్శనమిస్తాయి. తాజాగా, కాంబోడియాలో మెకాంగ్ నదిలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు అతిపెద్ద టేకు చేప (స్టింగ్ రే) దొరికింది. ఇది 13 అడుగుల పొడువు, 661 పౌండ్ల బరువు తూగింది. మంచినీటి చేపల్లో ప్రపంచంలోనే అతిపెద్ద చేప ఇదేనని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు కూడా సర్టిఫికెట్ ఇచ్చేశారు.
ఓ పికప్ ట్రక్ కంటే ఎక్కువ పొడవు, ఎలుగుబంటి కంటే అధికబరువుతో ఉన్న ఈ స్టింగ్ రే చేప కాంబోడియాలోని స్టంగ్ ట్రెంగ్ జిల్లాలో జూన్ 13న మత్స్యకారులకు చిక్కింది. కాగా, వాతావరణ కాలుష్యం కారణంగా ఈ స్టింగ్ రే చేపలు అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్నాయని గిన్నిస్ బుక్ యాజమాన్యం పేర్కొంది.