Koppula Eshwar: మంత్రి కొప్పుల ఈశ్వర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

Telangana High Court rejects minister Koppula Eshwar plea

  • 2018లో ధర్మపురి నుంచి పోటీచేసిన ఈశ్వర్
  • కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన అడ్లూరి లక్ష్మణ్
  • వీవీ ప్యాట్లు లెక్కించలేదన్న లక్ష్మణ్
  • ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్
  • కౌంటర్ దాఖలు చేసిన మంత్రి ఈశ్వర్
  • ఈశ్వర్ పిటిషన్ తోసిపుచ్చిన న్యాయస్థానం

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలంటూ కొప్పుల ఈశ్వర్ చేసుకున్న విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు నేడు తోసిపుచ్చింది. 

అసలేం జరిగిందంటే... కొప్పుల ఈశ్వర్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ పోటీ చేశారు. ఇందులో కొప్పుల ఈశ్వర్ విజేతగా నిలిచారు. 

అయితే, ఈవీఎంలకు సంబంధించిన వీవీ ప్యాట్లు లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్ గెలిచినట్టు ప్రకటించారని అడ్లూరి లక్ష్మణ్ కోర్టుకెక్కారు. ఇది ప్రజాస్వామ్య ప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకమని, ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

దీనిపై కౌంటర్ దాఖలు చేసిన కొప్పుల ఈశ్వర్... తన ఎన్నిక చెల్లదని చెప్పేందుకు అడ్లూరి లక్ష్మణ్ తగిన కారణాలు చూపలేదని కోర్టుకు విన్నవించారు. అయితే, కోర్టు ఈ వాదనలు పట్టించుకోలేదు. కొప్పుల ఈశ్వర్ కౌంటర్ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేసింది. త్వరలోనే అడ్లూరి లక్ష్మణ్ పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

Koppula Eshwar
Plea
Telangana High Court
Adluri Lakshman
Dharmapuri
Congress
TRS
Telangana
  • Loading...

More Telugu News