Mumbai: శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ముంబైకి.. ఏక్ నాథ్ షిండే వెల్లడి
- శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ముంబైకి.. ఏక్ నాథ్ షిండే వెల్లడి
- తన వెంట 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న షిండే
- అంతా హిందూత్వ కోసం స్వచ్ఛందంగా తన వెంట నిలిచారని వెల్లడి
- మహారాష్ట్రలో వేడెక్కిన రాజకీయ పరిణామాలు
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలంతా త్వరలోనే తిరిగి ముంబైకి చేరుకోన్నట్టు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఆధ్వర్యం వహిస్తున్న నేత ఏక్ నాథ్ షిండే వెల్లడించారు. అస్సాంలోని గౌహతిలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ బయట ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘గౌహతిలో నా వెంట 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారంతా హిందూత్వ కోసం స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి నా వెంట ఉన్నారు. మేమంతా త్వరలోనే ముంబైకి వెళతాం” అని ఏక్ నాథ్ షిండే వెల్లడించారు.
అధికారం చేపట్టడం కోసం..
ఏక్ నాథ్ షిండే వారం క్రితం గుజరాత్ వెళ్లి బీజేపీ సీనియర్ నేతలతో భేటీ అయి చర్చించారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించే ఆ భేటీ జరిగిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఏక్ నాథ్ షిండే నేరుగా ముంబైకి వెళ్ల వచ్చని.. లేదా ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హతపై వచ్చే నెల 11 వరకు చర్యలు తీసుకోవద్దని మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు ఆసక్తి కరంగా మారాయి.
మహారాష్ట్ర అసెంబ్లీలో సీఎం ఉద్ధవ్ థాక్రేను విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ ఆదేశించే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతే.. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏక్ నాథ్ షిండే సిద్ధమవుతున్నట్టు పేర్కొంటున్నాయి. దీనితో మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కాయి.