Agnipath Scheme: రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో కావాలనే ఇరికించారు.. బెయిల్ పిటిషన్ లో ఆవుల సుబ్బారావు
- నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు
- విధ్వంసంతో తనకేం సంబంధం లేదన్న సుబ్బారావు
- ఆర్మీలో సేవ చేసేలా యువకులను ప్రోత్సహించినట్టు వెల్లడి
అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు సృష్టించిన విధ్వంసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు నాంపల్లి కోర్టుకు విన్నవించుకున్నారు. ఈ మేరకు సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
సైన్యంలో సేవ చేసి.. అదే స్ఫూర్తితో సైన్యంలో చేరేలా యువకులను ప్రోత్సహిస్తున్నట్టు వివరించారు. సికింద్రాబాద్ ఘటనకు సంబంధించి పోలీసులు తనను కావాలనే కేసులో ఇరికించారని ఆరోపించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తనకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఏ 64గా సుబ్బారావు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం, బోగీలకు నిప్పుపెట్టడంపై రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసులో మధుసూదన్, పృథ్వీరాజ్ అనే యువకులు ఏ1, ఏ2గా ఉండగా.. ఆవుల సుబ్బారావు ఏ64గా ఉన్నారు. ఇక అల్లర్లకు ప్రోత్సహించారన్న ఆరోపణలతో ఆవుల సుబ్బారావు అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసును రైల్వే పోలీసులతో పాటు హైదరాబాద్ నగర పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తున్నారు.