VK Sasikala: అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు.. శశికళ మెగా రోడ్ షో
- చెన్నై, తిరువళ్లూర్, తిరుత్తణిలో శశికళ రోడ్ షో
- పేదలు, సామాన్యుల కోసమే పార్టీ పుట్టిందంటూ రామచంద్రన్ వ్యాఖ్యలను గుర్తు చేసిన శశికళ
- లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీని ఏకతాటిపైకి తెస్తానన్న జయలలిత నెచ్చెలి
అన్నాడీఎంకే పార్టీపై పట్టు కోసం మాజీ ముఖ్యమంత్రులు ఒ.పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రయత్నిస్తున్న వేళ ఆ పార్టీ బహిష్కృత ప్రధాన కార్యదర్శి, దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ రంగంలోకి దిగారు. తిరిగి రాజకీయాల్లో పట్టు సాధించాలని, ప్రజల మద్దతు కూడగట్టాలని బలంగా నిర్ణయించుకున్న ఆమె నిన్న చెన్నై, తిరువళ్లూర్, తిరుత్తణిలో మెగా రోడ్‌షో నిర్వహించారు. ప్రచార వాహనంపై టి.నగర్‌లోని తన ఇంటి నుంచి బయలుదేరిన శశికళ రోడ్ షో సందర్భంగా ప్రజలు, కార్యకర్తలను కలిశారు.
తిరుత్తణిలో ఆమె మాట్లాడుతూ.. ఎంజీ రామచంద్రన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. సామాన్య ప్రజలు, పేదల కోసమే తాను పార్టీని ప్రారంభిస్తున్నట్టు రామచంద్రన్ చెప్పారని పేర్కొన్నారు. అమ్మ (జయలలిత)లానే ప్రజల సంక్షేమం కోసమే పార్టీ పనిచేసిందన్నారు. ఈ పార్టీకి కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘అమ్మ’ మరణం తర్వాత ఆ బాధ్యత తనపైనే పడిందని, పార్టీని రక్షించాలన్న ఉద్దేశంతోనే తన ప్రయాణాన్ని ప్రారంభించినట్టు చెప్పారు.
పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై శశికళ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు, ప్రజలు తనతోనే ఉన్నారని, పేదలు, సామాన్యుల కోసం త్వరలోనే పార్టీని అధికారంలోకి తీసుకొస్తానన్నారు. పార్టీలో ఇద్దరు వ్యక్తుల కుమ్ములాటల వల్ల పార్టీ మొత్తం ఇబ్బందుల్లో కూరుకుపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా శశికళ చెప్పారు.
మిమ్మల్ని బహిష్కరించిన వారితో విభేదాలను తొలగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అన్న మరో ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. సమస్య తమ మధ్యే ఉందని, దానిని సరిదిద్దుకోవడం కూడా తమ పనేనని స్పష్టం చేశారు. పార్టీని ముందుకు నడిపించమని పార్టీ కార్యకర్తలు తనను కోరుతున్నారన్నారు. పార్టీ తన చేతుల్లో ఉండడం మంచిదని వారు భావిస్తున్నారన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ ఒకే నాయకత్వం కింద పనిచేస్తుందని, అది జరిగేలా చూస్తానని శశికళ వివరించారు.