Congress: మోదీ హయాంలో బ్యాంకు మోసాలపై మల్లికార్జున ఖర్గే ట్వీట్
- విజయ్ మాల్యా, నీరవ్ మోదీల మోసాలను ప్రస్తావించిన ఖర్గే
- అందరికంటే డీహెచ్ఎఫ్ఎల్ టాప్‌లో నిలిచిందని వెల్లడి
- బీజేపీకి డీహెచ్ఎఫ్ఎల్ రూ.27 కోట్ల విరాళమిచ్చిందన్న కాంగ్రెస్ నేత
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో చోటుచేసుకున్న బ్యాంకు మోసాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే శనివారం ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. 8 ఏళ్ల మోదీ పాలనలో రూ.6 లక్షల కోట్లకు పైగా ఆర్థిక నేరగాళ్లు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన భారీ రుణ ఎగవేతలను ప్రస్తావించారు.
మోదీ జమానాలో అతిపెద్ద బ్యాంకు మోసాలు ఇవేనంటూ ఆయన పలు కేసులను ప్రస్తావించారు. విజయ్ మాల్యా రూ.9 వేల కోట్లు ఎగవేస్తే.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు రూ.14 వేల కోట్లను ఎగవేశారని గుర్తు చేశారు. ఇక ఏబీజీ షిప్ యార్డ్ రూ.23 వేల కోట్లను ఎగవేస్తే... వీటన్నింటికంటే అధికంగా రూ.35 వేల కోట్లను ఎగవేసి డీహెచ్ఎఫ్ఎల్ అగ్రగామిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. తాను లూటీ చేసిన ప్రజాధనం నుంచి డీహెచ్ఎఫ్ఎల్ బీజేపీకి ఏకంగా రూ.27 కోట్ల మేర విరాళం ఇచ్చిందంటూ ఖర్గే అన్నారు.