Andhra Pradesh: అమరావతి భూముల విక్రయానికి సీఆర్డీఏ ప్రణాళిక.. వచ్చే నెలలోనే వేలం
- 248 ఎకరాల విక్రయానికి సీఆర్డీఏ ప్రతిపాదన
- అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- వేలంలో ఎకరం కనీస ధర రూ.10 కోట్లుగా నిర్ధారణ
- ఈ వేలం ద్వారా హీనపక్షం రూ.248 కోట్లు సేకరించాలని నిర్ణయం
- మరో 600 ఎకరాల విక్రయానికి కూడా సీఆర్డీఏ ప్రణాళిక
ఏపీ రాజధాని అమరావతిలో భూముల విక్రయానికి ఏపీసీఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాజధాని పరిధిలో రెండు సంస్థలకు కేటాయించిన 248.34 ఎకరాలను వేలం ద్వారా విక్రయించేందుకు సీఆర్డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేయగా... అందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 389 పేరిట శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వేలంలో ఎకరం భూమి కనీస ధరను రూ.10 కోట్లుగా నిర్ధారించారు.
రాజధాని పరిధిలో గతంలో బీఆర్ శెట్టి మెడిసిటీకి కేటాయించిన 100 ఎకరాలతో పాటు లండన్ కింగ్స్ కాలేజీకి కేటాయించిన 148 ఎకరాలను తొలి విడతలో విక్రయించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఈ రెండు సంస్థల మొత్తం భూములు 248 ఎకరాలను విక్రయించడం ద్వారా హీనపక్షం రూ.248 కోట్లు సేకరించాలని సీఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన వేలం ప్రక్రియను వచ్చే నెలలోనే నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది.
రాజధాని అభివృద్ధికి బ్యాంకుల నుంచి రుణాలు లభించని నేపథ్యంలో సొంతంగానే నిధులు సమకూర్చుకోవాలనుకుంటున్నట్లు సీఆర్డీఏ ప్రభుత్వానికి తెలిపింది. భూముల విక్రయం ద్వారా అందే నిధులను రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు సీఆర్డీఏ తెలిపింది. ఈ ప్రతిపాదనలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే.. ఈ 248 ఎకరాల భూముల విక్రయం ముగియగానే... రాజధాని పరిధిలోని మరో 60 ఎకరాలను కూడా అమ్మేసేందుకు సీఆర్డీఏ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఏడాదికి 50 ఎకరాల చొప్పున ఈ 600 ఎకరాలను వేలం పద్దతిలోనే విక్రయించాలని సీఆర్డీఏ భావిస్తున్న తెలుస్తోంది.