Vijayawada: టొబాకో ఫ్రీ జోన్‌గా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం... ఉల్లంఘిస్తే రూ.200 ఫైన్
- ఇప్పటికే పొగాకు నిషేధిత ప్రాంతంగా తిరుమల
- బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని టొబాకో ఫ్రీ జోన్‌గా ప్రకటించిన వైనం
- మెట్ల మార్గం నుంచి కొండ పై భాగం వరకు పొగాకు నిషేధం
- పొగాకు వినియోగంతో పాటు విక్రయాలు కూడా నిషిద్ధమన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
ఏపీలో మరో ఆలయ ప్రాంగణం పొగాకు నిషేధిత ప్రాంతంగా మారిపోయింది. ఇప్పటికే తిరుమల ఆలయాన్ని టొబాకో ఫ్రీ జోన్‌గా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం తాజాగా విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయ పరిసరాలను కూడా పొగాకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది. ఈ నిబంధనలు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు శనివారం ఆలయ పరిసరాల్లోనే ప్రకటించారు.
ఈ నిషేధం ప్రకారం ఆలయ మెట్ల మార్గం నుంచి కొండ పై భాగం వరకు పొగాకు ఉత్పత్తుల వినియోగంతో పాటు విక్రయాలు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించే వారిపై కనిష్ఠంగా రూ.20 నుంచి గరిష్ఠంగా రూ.200 వరకు జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ అధికారులు, సిబ్బందితో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు కూడా దీనిపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.