Chandrababu: ఉదయగిరిలో నారాయణ అనే దళిత వ్యక్తి మృతి... అధికారులను నిలదీసిన చంద్రబాబు

Chandrababu opines on Narayana death in Udayagiri

  • నెల్లూరు జిల్లాలో ఘటన
  • నారాయణ కుటుంబ సభ్యులకు చంద్రబాబు మద్దతు
  • కుటుంబ సభ్యులు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారని వెల్లడి
  • అధికారులు సమాధానం చెప్పాలన్న చంద్రబాబు

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నారాయణ అనే దళిత వ్యక్తి మృతి చెందిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ ఘటనలో ప్రభుత్వం వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు కొట్టిన దెబ్బల కారణంగా నారాయణ చనిపోయారంటున్న కుటుంబ సభ్యుల వాదనకు అధికారులు ఎందుకు సమాధానం చెప్పడంలేదని నిలదీశారు. 

"పోస్టుమార్టం అయ్యాక 40 మంది పోలీసులు బాధిత కుటుంబాన్ని భయపెట్టి, వారి సంప్రదాయానికి విరుద్ధంగా మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి బదులు ఎందుకు దహనం చేశారు? ఘటనకు కారణమైన ఎస్సైపై ఎంతోకాలంగా ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నా అతనిపై చర్యలు తీసుకోకుండా ఆపుతున్నది ఎవరు?" అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసుల దాడుల్లో దళితులు ప్రాణాలు కోల్పోతే నిందితులను రక్షించేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 

చనిపోయిన నారాయణకు భార్య, ముగ్గురు పిల్లలు, దివ్యాంగురాలైన సోదరి ఉన్నారని చంద్రబాబు వివరించారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నారాయణ కుటుంబాన్ని ఆదుకుని పరిహారం అందించాలని, అలాగే దళిత వ్యక్తి మృతికి కారణమైన పోలీసులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News