Andhra Pradesh: మార్నింగ్ వాక్ చేస్తూ కిందపడిపోయిన ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్
![apminister adimulapu suresh fell down in the morning walk](https://imgd.ap7am.com/thumbnail/cr-20220625tn62b6cafc608e0.jpg)
- ఇటీవలే స్టెంట్ వేయించుకున్న సురేశ్
- మార్కాపురంలోని తన కళాశాల ప్రాంగణంలో మార్నింగ్ వాక్కు వెళ్లిన మంత్రి
- మార్నింగ్ వాక్ చేస్తూనే కిందపడిపోయిన వైనం
- బీపీ హెచ్చుతగ్గుల వల్లే సురేశ్ కిందపడిపోయారన్న వైద్యులు
ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శనివారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఆయన నడుస్తూనే ఉన్నట్టుండి కింద పడిపోయారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని తన కళాశాల ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వైద్యులు హుటాహుటీన కళాశాలకు చేరుకుని సురేశ్‌కు చికిత్స అందించారు.
రక్తపోటు(బీపీ)లో హెచ్చుతగ్గుల కారణంగానే సురేశ్ అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తేల్చారు. ఇటీవలే ఓ దఫా అనారోగ్యానికి గురైన సురేశ్ ఆసుపత్రిలో చేరగా... ఆయనకు యాంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించి గుండె కవాటాల్లో అవరోధాలు ఉన్నట్లుగా తేల్చారు. ఈ క్రమంలో ఆయనకు స్టెంట్ అమర్చారు. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సురేశ్ బాగానే కనిపించినా... శనివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తూనే కిందపడిపోయారు.