health insurance: ఆరోగ్య బీమా ఏ వయసులో తీసుకోవాలి..?
- చిన్న వయసులోనే తీసుకోవాలి
- 20-25 ఏళ్లు అనుకూలం
- అప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు
- ప్రీమియం తక్కువ.. వెయిటింగ్ పీరియడ్ కూడా అనుకూలమే
ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికీ అవసరం. 2020, 2021లో కరోనా ఎంతటి విపత్తు కలిగించిందో కళ్లారా చూశాం. ఆసుపత్రిలో చేరితే రోజు రూ.లక్షకు పైనే ప్రాణం కోసం చెల్లించాల్సి వచ్చింది. అంతకట్టినా ప్రాణాలకు గ్యారంటీ లేని బాధాకరమైన పరిస్థితి. కట్టే స్తోమత లేని వారు చికిత్స తీసుకోలేకపోయారు. కట్టిన వారు ఆర్థికంగా గుల్లయిన వారు ఎందరో. ఆరోగ్య బీమా ఉన్నవారు ఏదోలా గట్టెక్కారు. లేని వారి పరిస్థితే మరీ దారుణం. అందుకే ఆరోగ్య బీమా అవసరం. ఎప్పుడు ఏ రూపంలో అవసరం వస్తుందో ఎవరూ చెప్పలేరు.
ఏ వయసు..?
చాలా మంది తాము ఆరోగ్యంగా ఉన్నామని, తమకు ఇంకా వృద్ధాప్యం రాలేదని, ఆరోగ్య సమస్యల్లేవని.. ఆరోగ్య బీమా తీసుకునేందుకు మొగ్గు చూపించరు. వారు చేసే పెద్ద తప్పిదం ఇదే. ఇలా ఆలస్యం చేయడం వల్ల వయసు మీరిన తర్వాత ఆరోగ్య బీమాకు అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కచ్చితమైన సమయం.. యుక్త వయసే. ఆర్జన ఆరంభించిన వెంటనే తీసుకోవాలి. మరీ చెప్పాలంటే 20-25 మధ్య తీసుకోవాలి.
ప్రయోజనాలు..
చిన్న వయసులోనే హెల్త్ ప్లాన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా పూర్తి రక్షణ కల్పించుకున్నట్టు అవుతుంది. ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. బీమా సంస్థలు పాలసీదారుని వయసుతోపాటు.. అతడికి లేదా ఆమెకు అప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఎంత మొత్తానికి బీమా తీసుకుంటున్నారు? పాలసీకి అనుబంధంగా ఇతర కవరేజీలు తీసుకుంటున్నారా? తదితర అంశాల ఆధారంగా ప్రీమియం నిర్ణయిస్తాయి. చిన్న వయసులో 99 శాతం మందికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు బయటపడవు. అందుకని ఆ సమయంలోనే హెల్త్ ప్లాన్ తీసుకోవాలి. దానివల్ల ప్రీమియం తక్కువకే వస్తుంది.
వెయిటింగ్ పీరియడ్
బీమా ప్లాన్ లో కొన్ని వ్యాధులు, సమస్యలకు కవరేజీ పొందాలంటే పాలసీ తీసుకున్న నాటి నుంచి కొన్నేళ్ల పాటు వేచి ఉండాలి. మరి వయసు మీద పడిన తర్వాత పాలసీ తీసుకుంటే వేచి ఉండడం కష్టం కదా. అందుకని చిన్న వయసులో తీసుకుంటే ఆయా కవరేజీలు అవసరపడవు. వెయిటింగ్ పీరియడ్ కూడా ముగిసిపోయి కవరేజీ పొందడానికి అర్హత లభిస్తుంది.
వైద్య పరీక్షలు అవసరపడవు
40-50 ఏళ్లు దాటిన వారిని ఆరోగ్య సమస్యలు పలకరించడమే కాకుండా.. హెల్త్ ప్లాన్ కు దరఖాస్తు చేసుకుంటే మెడికల్ టెస్ట్ లు చేయించుకోవాల్సి రావచ్చు. ఏవైనా సమస్యలు బయటపడితే ప్రీమియం పెరగడమే కాదు.. గుర్తించిన వాయిటికి వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుంది.