Bharat NCAP: వాహనాల భద్రతను బట్టి ఇకపై 'స్టార్' రేటింగ్స్!.. కేంద్రమంత్రి వెల్లడి
- భారత్ ఎన్‌సీఏపీ పేరిట కొత్త రేటింగ్‌లన్న గడ్కరీ
- క్రాష్ టెస్టుల ఫలితాల ఆధారంగా ఇస్తారని వెల్లడి
- ఈ విధానంతో వాహన రంగం స్వయం సమృద్ధమవుతుందని వ్యాఖ్య
దేశంలో వాహనాలకు సరికొత్తగా స్టార్ రేటింగ్‌లు ఇవ్వనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. అందుబాటులో ఉన్న వాహనాల్లో అత్యంత భద్రతతో కూడిన వాహనం ఏదన్న విషయం ఈ రేటింగ్‌ల ద్వారా వినియోగదారుడికి ఇట్టే తెలిసిపోతుందని కూడా ఆయన వెల్లడించారు. భారత్ ఎన్‌సీఏపీ (భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) పేరిట ఈ కొత్త రేగింట్ పద్ధతిని అమలులోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు.
ఈ రేటింగ్‌లు ఇవ్వడానికి ఆయా వాహనాలకు క్రాష్ టెస్టులు నిర్వహించనున్నట్లు గడ్కరీ వెల్లడించారు. ఈ టెస్టుల్లో వచ్చే ఫలితాల ఆధారంగానే భారత్ ఎన్‌సీఏపీ రేటింగ్‌లు ఇస్తామని ఆయన తెలిపారు. గ్లోబల్ క్రాస్ టెస్టులకు అనుగుణంగానే ఈ టెస్ట్‌లను నిర్వహిస్తామన్నారు.
ఈ రేటింగ్ పద్దతి వల్ల వాహన పరికరాల తయారీదారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో దేశీయ వాహనాల ఎగుమతులు కూడా పెరుగుతాయని ఆయన చెప్పారు. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే... భారత వాహన రంగం స్వయం సమృద్ధి సాధిస్తుందని కూడా గడ్కరీ తెలిపారు.