Pakistan: భారత్ మంచి జట్టే.. కానీ పాకిస్థాన్ ముందు మాత్రం దిగదుడుపు: పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్
- అంతర్జాతీయ క్రికెట్లో పాక్ ఆడినంత గొప్పగా మరే జట్టూ ఆడడం లేదన్న లతీఫ్
- ఆ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని ప్రశంస
- 2022 ఆసియా కప్ పాకిస్థాన్‌దేనని జోస్యం
భారత క్రికెట్ జట్టు ఉత్తమమైనదే అయినా తమకంటే మాత్రం కాదని పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ జట్టులో కెప్టెన్ బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షహీన్ షా అఫ్రిది వంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, ఐసీసీ నుంచి కూడా వారు పలు అవార్డులు అందుకున్నారని గుర్తు చేశాడు. భారత జట్టు మంచి క్రికెట్ ఆడుతోందని ప్రశంసించిన రషీద్.. అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్థాన్ ఆడినంత గొప్పగా మరే జట్టూ ఆడలేదన్నాడు.
"భారత్ మంచి జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ ఆడుతున్న తీరుకు మాత్రం ఉదాహరణ లేనే లేదు. పాకిస్థాన్‌లో షాహీన్ షా ఆఫ్రిది, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఐసీసీ నుంచి అత్యుత్తమ క్రికెటర్లుగా వీరంతా పేరు సంపాదించారు’’ అని లతీఫ్ చెప్పుకొచ్చాడు.
2022 ఆసియా కప్‌లో ఇతర జట్లు కూడా పోటీ ఇస్తాయని, అయితే, ప్రధాన పోటీ మాత్రం భారత్-పాకిస్థాన్ మధ్యే ఉంటుందని లతీఫ్ అభిప్రాయపడ్డాడు. గతేడాది దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించిన తర్వాత పాక్ జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందన్నాడు. ఆసియా కప్‌ను పాకిస్థాన్ కొట్టుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పాడు. కాగా, 1992-2003 మధ్య కాలంలో పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించిన రషీద్ లతీఫ్ 37 టెస్టులు, 166 వన్డేలు ఆడాడు.