golden rules: ఆర్థికంగా ఆనందంగా ఉండాలంటే..?

golden rules for making your financial life happier

  • ఆర్థిక ప్రణాళిక ఉండాల్సిందే
  • వచ్చే ప్రతి రూపాయి.. వెళ్లే ప్రతి రూపాయికీ లెక్క ఉండాలి
  • వ్యయాలు అదుపులో పెట్టుకోవాలి
  • అన్ని బీమా రక్షణలు కల్పించుకోవాల్సిందే

మన చుట్టూ ఉన్న, సంపాదన శక్తి కలిగిన వారిలో ఎక్కువ మందిని విచారించి చూస్తే.. వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని కచ్చితంగా చెబుతారు. దీనికి కారణం వారివద్ద ఆర్థిక ప్రణాళిక లేకపోవడమే. వచ్చే రూపాయిని ఎలా వినియోగించుకోవాలన్న స్పష్టత లోపించడమే. 

సంతృప్తి
మరింత సంపాదించాలి.. మరింత విజయాన్ని చూడాలి.. నిజానికి ఇవి మనసులో అఖండ జ్యోతుల్లాంటివి. ఇప్పటి వరకు సంపాదించినది లేదా సంపాదిస్తున్నది సంతృప్తికరంగా లేదా? ఈ ప్రశ్న వేసుకోవాలి. ఇప్పటి వరకు సాధించిన విజయాలు మీకు సంతోషాన్ని ఇవ్వడం లేదా? అని కూడా ప్రశ్నించుకోవాలి. ఉన్నదాంతో సంతృప్తి చెందడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎక్కువ. 

భవిష్యత్తుకు దారి
మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్నది మీకే తెలుస్తుంది. అందుకే సమగ్రమైన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆదాయం, అందులో చేస్తున్న ఖర్చు, పొదుపు, రుణాలకు చెల్లిస్తున్న ఈఎంఐలు, భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన బాధ్యతలు.. వీటన్నింటినీ కచ్చితంగా రాసుకోవాలి. ఆదాయంలో పొదుపు, పెట్టుబడులకు కొంత భాగాన్ని పక్కన పెట్టిన తర్వాత మిగిలిన బడ్జెట్ ను ఇతర అవసరాలకు కేటాయించుకోవాలి. 

దీనివల్ల భవిష్యత్తుకు సన్నద్ధమైనట్టు ఉంటుంది. చాలా మంది ఆర్థిక ప్రణాళిక అంటూ లేకుండా సాగిపోతుంటారు. వచ్చిన ఆదాయాన్ని ఖర్చు చేయడం తప్పించి.. ప్రణాళికాయుతంగా వినియోగించడం, ఆదా చేయడంపై దృష్టి పెట్టారు. వచ్చిన ఆదాయం ఏ మాత్రం చాలడం లేదని కూడా చెబుతుంటారు. 

టైమ్ మేనేజ్ మెంట్
కాలం చాలా పవర్ ఫుల్. ఆగమన్నా ఒక్క సెకను కూడా ఆగదు. మనిషి జీవన కాలం కూడా అంతే. అందుకని సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అన్నది తెలియాలి. అవసరమైనంత సమయం కష్టపడాలి. వీలైనంత మెరుగ్గా సంపాదించుకోవాలి. ఆదాయం పెంచుకునేందుకు కూడా కొంత సమయం కేటాయించుకోవాలి. సమయం వృథా అయ్యే పనులకు చోటు కల్పించకుండా.. చక్కగా వినియోగించుకోవడంపై దృష్టి పెట్టాలి.

రుణాలు
అప్పుతో వచ్చేది ఏదీ వద్దు. రుణానికి దూరంగా ఉండడం కూడా ఆర్థిక ఆనందంలో భాగం. సున్నా ఈఎంఐ అన్నారని రూ.60 వేలు పెట్టి ఐఫోన్ కొని వాడితే వచ్చే ఆనందం ఎంతో కానీ.. ప్రతి నెలా కట్టాల్సిన ఈఎంఐ రూపంలో పడే ఒత్తిడే ఎక్కువ. అందుకే రుణంపై ఏమీ కొనుగోలు చేయవద్దు. పన్ను ఆదా చేసే, గూడు కల్పించే ఒక గృహ రుణానికి మినహాయింపు ఉంది. 

వ్యయాలు
నెలకు రూ.10,000 వచ్చినా.. రూ.50,000-1,00,000 వచ్చినా కోటి విద్యలూ కూటి కోసమేనన్నట్టు.. ఆదాయం ఎంతన్నది కాకుండా ఎంత ఖర్చు పెడుతున్నామనే దానిపై ఫోకస్ పెంచాలి. ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అనవసర, అధిక వ్యయాలకు దూరంగా ఉండాలి. హుషారుతో, ఉద్రేకంతోనూ ఖర్చు చేస్తుంటాం. దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పుతుంది. సమస్యలు పలకరిస్తాయి. 

బీమా రక్షణ
ఆర్థిక కష్టాలు తెచ్చుకోకూడదు.. అని కోరుకుంటే సవాళ్ల నుంచి రక్షణ కల్పించుకోవాలి. ప్రాణానికి రిస్క్ ఏర్పడితే టర్మ్ ఇన్సూరెన్స్ రూపంలో కుటుంబ సభ్యులకు పరిహారం అందుతుంది. ప్రమాదం వల్లో లేక ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రి పాలైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఆదుకుంటుంది. ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చేస్తే హోమ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్.. వాహనానికి ఏదైనా నష్టం జరిగితే వాహన బీమా ఆదుకుంటాయి. కనుక వీటిని తప్పకుండా తీసుకోవాలి.

More Telugu News