Cine Labor: హైదరాబాదులో ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన సినీ కార్మికులు

Cine Labor protests at Film Federation office in Hyderabad

  • సినీ కార్మికుల సమ్మెబాట
  • వేతనాలు పెంచాలని డిమాండ్
  • ఫెడరేషన్ కార్యాలయానికి తరలివచ్చిన కార్మికులు
  • భారీగా పోలీసుల మోహరింపు

డిమాండ్ల సాధన కోసం తెలుగు చిత్ర పరిశ్రమ కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ప్రధానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వివిధ కార్మిక సంఘాలు సమ్మె ప్రతిపాదన చేశాయి. నిర్మాతల మండలి, ఇతర సంఘాలు కార్మికులతో నిన్న జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. 

ఈ నేపథ్యంలో, నేడు హైదరాబాదు జూబ్లీహిల్స్ పరిధిలో వెంకటగిరిలో ఉన్న ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాన్ని సినీ కార్మికులు ముట్టడించారు. చిత్ర పరిశ్రమకు చెందిన వివిధ యూనియన్లకు చెందిన కార్మికులు భారీగా తరలివచ్చారు. తమ డిమాండ్లకు సంబంధించిన నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. 

గత నాలుగేళ్లుగా పెంచాల్సిన వేతనాలు పెంచడంలేదని వాపోయారు. ఇంటి అద్దెలు, నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయని, చాలీచాలని వేతనాలతో ఇబ్బందులపాలవుతున్నామని కార్మికులు వెల్లడించారు. పిల్లల స్కూలు ఫీజులు కూడా కట్టలేకపోతున్నామని ఆవేదన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో, తమ వేతనాలు పెంచాల్సిందేనని వారు పట్టుబట్టారు. సినీ కార్మికుల నిరసన నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

  • Loading...

More Telugu News