Vangalapudi Anitha: మహిళా పోలీసుపై మండిపడ్డ వంగలపూడి అనిత... వీడియో ఇదిగో!
- ఛలో నర్సీపట్నంకు పిలుపునిచ్చిన టీడీపీ
- పలుచోట్ల టీడీపీ నేతల గృహనిర్బంధం
- అనిత గృహనిర్బంధానికి పోలీసుల యత్నం
- రాజ్యాంగ విరుద్ధమన్న అనిత
మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీ గోడ కూల్చివేతకు నిరసనగా, టీడీపీ నాయకత్వం నేడు ఛలో నర్సీపట్నం కార్యాచరణ చేపట్టింది. అయితే, టీడీపీ నేతలను పలుచోట్ల గృహనిర్బంధం చేశారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితను గృహనిర్బంధం చేసేందుకు ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ ఆమె ఇంటికి వెళ్లారు. ఆ మహిళా పోలీసు నోటీసులు లేకుండా రావడంతో ఆమె మండిపడ్డారు. కనీసం ఆ మహిళా పోలీసుకు నేమ్ ప్లేట్ కూడా లేకపోవడాన్ని అనిత ప్రశ్నించారు.
41ఏ నోటీసులు ఉంటేనే తన ఇంటికి రావాలని, అప్పుడు గృహనిర్బంధం చేసుకుంటే తనకే ఇబ్బంది లేదని కరాఖండీగా చెప్పారు. నిబంధనలు పాటించకుండా వచ్చి గృహనిర్బంధం అంటే కోర్టులో కేసు వేస్తానని హెచ్చరించారు. అంతేకాదు, అప్పటికప్పుడు ఆ మహిళా పోలీసుతో సీఐకి ఫోన్ చేయించి ఇదే విషయాన్ని ఆ అధికారికి కూడా స్పష్టం చేశారు.
దీనిపై అనిత ట్విట్టర్ లో స్పందించారు. నిబంధనలు పాటించకుండా వచ్చి గృహనిర్బంధం అనే పోలీసులను నిలదీయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.