Team India: నేడు సౌతాఫ్రికాతో చివరి టీ20.. గాడిలో పడకుంటే పంత్​ పనైపోయినట్టే!

India takes on South africa today all ayes on  Rishabh Pant batting

  • గత నాలుగు మ్యాచ్ ల్లో  నిరాశ పరిచిన రిషబ్
  • ఒకే రకంగా ఔటవడంపై మాజీల విమర్శలు
  • కీపర్లు దినేశ్ కార్తీక్, ఇషాన్  రూపంలో జట్టులో స్థానానికి ముప్పు 

భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ క్లైమాక్స్ కు  చేరుకుంది. తొలి రెండు మ్యాచ్ ల్లో  దక్షిణాఫ్రికా నెగ్గగా.. తర్వాతి రెండు టీ20ల్లో భారత్ గెలిచింది. దాంతో, ఇరు జట్లూ ఇప్పుడు 2-2తో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఐదో మ్యాచ్ ఫలితం సిరీస్ విజేతను తేల్చనుంది. ఇందులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత జట్టు కృత నిశ్చయంతో ఉంది. గత రెండు మ్యాచ్ ల్లో ఘన విజయాలతో ఆతిథ్య జట్టు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. మరోవైపు భారత్ లో ఇప్పటికిదాకా ఒక్క టీ20 సిరీస్ కోల్పోని సఫారీల జట్టు అదే రికార్డును కొనసాగించాలని చూస్తోంది

 ఈ మ్యాచ్‌‌‌‌ కోసం భారత తుది జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు. నాలుగో మ్యాచ్‌‌‌‌లో ఆడిన జట్టునే కొనసాగించొచ్చు. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ శుభారంభం ఇవ్వాలని జట్టు కోరుకుంటోంది. లోయర్ ఆర్డర్ లో  హార్దిక్ పాండ్యాతో పాటు గత మ్యాచ్ లో మెరుపు హాఫ్ సెంచరీ చేసిన దినేశ్ కార్తీక్ మంచి ఫామ్ లో ఉండటం జట్టుకు సానుకూలాంశం. తొలి రెండు మ్యాచ్ ల్లో నిరాశ పరిచిన బౌలర్లు కూడా మూడు, నాలుగో టీ20ల్లో అద్భుతంగా రాణించారు. కానీ, టాపార్డర్ లో శ్రేయస్ అయ్యర్, మిడిలార్డర్ లో స్టాండిన్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ పైనే జట్టు ఆందోళన చెందుతోంది. ఈ సిరీస్ లో  ఇద్దరూ పెద్దగా రాణించింది లేదు. అయ్యర్ రెండో మ్యాచ్ లో  40 పరుగులు చేసినా.. పంత్ మాత్రం నాలుగు ఇన్నింగ్స్ ల్లోనూ నిరాశ పరిచాడు.
 
గాయం కారణంగా లోకేశ్ రాహుల్ జట్టుకు దూరం అవడంతో అనూహ్యంగా కెపెన్సీ బాధ్యతలు అందుకున్న పంత్ నాయకత్వంతో పాటు బ్యాటింగ్ లోనూ నిరాశ పరిచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గత నాలుగు ఇన్నింగ్స్ ల్లో ఆఫ్ స్టంప్ లైన్ పై వేసిన బంతులు వెంటాడుతూ ఒకే రకంగా ఔటవడంతో మాజీలు, విశ్లేషకులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ గా ఉన్న వ్యక్తి ఇలా వికెట్ పారేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంత్ తక్షణమే గాడిలో పడాల్సిన అవసరం ఏర్పడింది. ఐదో టీ20లో  బ్యాట్ ఝుళిపించకపోతే అతని కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జట్టులో ఉన్న ఇద్దరు కీపర్లు దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్ రూపంలో పంత్ స్థానానికి ముప్పు ఉంది. మరి, పంత్ తన  ధనాధన్ బ్యాటింగ్ తో జట్టును గెలిపించడంతో పాటు తన కెరీర్ కు ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకుంటాడో లేదో చూడాలి.

  • Loading...

More Telugu News